మేకల కాపరిపై పులి దాడి.. వేగంగా పరుగెత్తి

మేకల కాపరిపై పులి దాడి.. వేగంగా పరుగెత్తి

ఆదిలాబాద్‌  జిల్లా : మేకల కాపరిపై పులి దాడి చేసిన సంఘటన శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. భీంపూర్‌ మండలం, అంతర్గాం గ్రామం వద్ద పెన్‌గంగ నది తీరానికి అవతల సేనాపతి బిజారామ్‌ అనే మేకలకాపరిపై  పులి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. పులి దాడి చేసినప్పటికీ వేగంగా పరుగెత్తి, ప్రాణాలతో తప్పించుకున్న అతడు ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు డాక్టర్లు. అయితే అతడి పరిస్థితి విషమంగానే ఉందన్నారు.

ఇటీవల భీంపూర్‌ మండల పెన్‌గంగ నది ఒడ్డున ఉన్న గొల్లగడ్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర టేంబి పల్లెలో పత్తి చేనులో ఉన్న ముసలమ్మను పులి చంపేసిందని చెప్పారు పోలీసులు. మహారాష్ట్ర ఇవ్‌రీ గ్రామంలో కూడా పులి అప్పుడప్పుడు కనిపిస్తున్నదని స్థానికులు తెలిపారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచే పెన్‌గంగ దారిలో పులులు వలస వస్తున్నాయన్నారు అటవీ అధికారులు. పులుల సంచారంపై పెన్‌ గంగ నది సమీపంలో ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ పల్లెల్లో ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పులుల దాడులతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు స్థానికలు.