అమ్రాబాద్‌‌లో 36 కి చేరిన పులులు

అమ్రాబాద్‌‌లో 36 కి చేరిన పులులు
  • 13 మగ, 20 ఆడ పులులతో పాటు మరో మూడు కూనలు
  • సర్వే వివరాలు వెల్లడించిన డీఎఫ్‌వో రోహిత్ గోపిడి

అమ్రాబాద్, వెలుగు : అమ్రాబాద్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్‌‌ రోహిత్‌‌ గోపిడి తెలిపారు. ఈ మేరకు గురువారం సర్వే వివరాలను విడుదల చేశారు. అమ్రాబాద్‌‌ టైగర్‌‌ రిజర్వ్‌‌లోని 10 రేంజ్‌‌లను నాలుగు బ్లాకులుగా విభజించి సర్వే చేసినట్లు చెప్పారు. ప్రతి రెండు చదరపు కిలోమీటర్లకు ఒక కెమెరాను ఏర్పాటు చేసి, పులుల పాదముద్రలు, మలం, స్క్రాప్‌‌ మార్క్‌‌, రేక్‌‌ మార్క్‌‌ ద్వారా సర్వే నిర్వహించామన్నారు. అమ్రాబాద్‌‌ టైగర్‌‌ ఫారెస్ట్‌‌లో రెండేండ్ల కింద 26 పులులు ఉండగా.. ప్రస్తుతం 36కు చేరినట్లు తెలిపారు. ఇందులో 13 మగ పులులు, 20 ఆడ పులులు కాగా.. మరో మూడు లింగ నిర్ధారణ కాని పులి కూనలు ఉన్నాయన్నారు. ఆడ పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో భవిష్యత్‌‌లో పులుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.