మ్యాన్​ ఈటర్​గా ముద్రేశారు.. మట్టుబెట్టారు!

మ్యాన్​ ఈటర్​గా ముద్రేశారు.. మట్టుబెట్టారు!

అవని…టీ1 పేరుతో పాపులరైన ఆడపులి కథ ఇది.మహారాష్ట్రలోని యావత్ మల్ జిల్లా అడవుల్లో ఉండేది. 13 మందిని ఈ ఆడ పులి చంపేసిందన్నది  మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు చెప్పిన మాట. నర మాంసానికి అవని అలవాటు పడిందని, అందుకే చాలావరకు డెడ్ బాడీస్ దొరకలేదన్నది అధికారుల వాదన.

అవని కాల్చివేత సంఘటనతో అసలు మనిషి మాంసాన్ని తినడానికి పులులు ఆసక్తి చూపిస్తాయా అనే ప్రశ్న వచ్చింది. ‘పులులు ఇతర జంతువుల మాంసం తింటాయి కానీ, సహజంగా మనుషుల మాంసాన్ని తినడానికి ఇష్టపడవు’ అంటున్నారు జువాలజిస్టులు. సాధ్యమైనంత వరకు మనుషులకు ఎదురుపడటానికి కూడా పులులు ఇష్టపడవంటున్నారు. పులిని చూసి మనిషి ఎంత భయపడతాడో… పులి కూడా మనిషిని చూసి అలాగే భయపడుతుందన్నారు. అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా మనిషి కనిపిస్తే సాధ్యమైనంతవరకు తప్పించుకుపోవటానికి ప్రయత్నిస్తుందన్నారు. మనిషి వల్ల తన ప్రాణమే డేంజర్ లో పడిందని భావించినప్పుడు మాత్రమే ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. అంతమాత్రాన ‘మనుషుల్ని తినే పులి (మ్యాన్ ఈటర్)’ అంటూ ముద్ర వేయడం కరెక్ట్ కాదన్నది జువాలజిస్టుల వాదన. అవని చంపినట్లు అధికారులు చెప్పిన మనుషుల శవాలకు పోస్టు మార్టం నిర్వహిస్తే 13మందిలో  కేవలం ఒక్కరిలోనే పులి దాడి చేసిన లక్షణాలు అవి కూడా కొంతమేరకు కనిపించాయి. దీంతో మిగతా 12 మంది ప్రాణాలు తీసింది ఎవరన్న  ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు.

మ్యాన్ ఈటర్ అనకూడదు… డేంజరస్ అనాలి

ఆడపులి అవనిని హతమార్చి ఏడాదైంది. అవనిని చంపిన తరువాత దీనికి సంబంధించిన అనేక అంశాలపై నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ లోతుగా చర్చించింది. జువాలజిస్టులు, జంతు ప్రేమికులతో మాట్లాడింది. చివరకు మనుషులను పొట్టన పెట్టుకుంటాయని భావిస్తున్న పులులను ‘మ్యాన్ ఈటర్’ అనకూడదని, ‘డేంజరస్’ అని మాత్రమే అనాలని నిర్ణయించుకుంది. ఇవి కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటాయని చెప్పింది. ‘మ్యాన్ ఈటర్’ అనే పదం బ్రిటిష్ వాళ్లు వాడుకలోకి తెచ్చారని జంతు ప్రేమికులు అంటున్నారు. దాదాపుగా పులులన్నిటినీ ‘మ్యాన్ ఈటర్స్’గా బ్రాండ్ చేయడానికి బ్రిటిష్ పాలకులు ప్రయత్నించారన్నది జంతు ప్రేమికుల వాదన. ఇలా చేయడం వల్ల అడవుల్లో ఇష్టం వచ్చినట్లు వేట కొనసాగించవచ్చన్నది బ్రిటిష్ పాలకుల ఆలోచన అంటున్నారు జంతు ప్రేమికులు. ఆడపులి అవనిని హతమార్చిన తీరును కేంద్ర మంత్రి మేనకా గాంధీ తప్పు పట్టారు. మహారాష్ట్ర  ప్రభుత్వం కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తే  అవనిని  ప్రాణాలతో పట్టుకునే వాళ్లమన్నారు. ఈ విషయంలో అన్ని  రూల్స్​కు  మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు తూట్లు పొడిచారని ఆరోపించారు. ఒక దశలో అప్పటి మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. మేనకా గాంధీ ఒక్కరే కాదు, వన్యప్రాణుల హక్కుల కార్యకర్తలు, జంతువుల హక్కుల సంస్థ ‘పెటా’కూడా మహారాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి.

ఆడపులి అవనిని ఎలా చంపేశారు?

ఆడపులి అవనికి ఆరేళ్లు. దీనికి తొమ్మిది నెలల వయసున్న రెండు కూనలు ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా మహారాష్ట్రలోని బోరాటి అడవుల్లో తిరుగుతూ నరమాంసానికి అలవాటు పడిందని ఫిర్యాదులు వచ్చాయి. చంపడానికి అధికారులు రెడీ సమయంలో జంతు ప్రేమికులు అడ్డు తగిలారు. దీంతో ఇష్యూ  సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. పట్టుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో లాస్ట్​ చాయిస్​గా మాత్రమే అవనిని కాల్చివేయడానికి 2017 సెప్టెంబరులో సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో గుర్రాలు, మేకలను ఎరలుగా చెట్టుకు కట్టేశారు. మగపులి మూత్రాన్ని , కొన్ని ఫెర్ఫ్యూమ్  సీసాలను బోరాటి అడవుల్లోని అనేక ప్రాంతాల్లో వెదజల్లారు. కిందటేడాది నవంబరు నెలలో  ప్రైవేటు హంటర్ సాయంతో ఆపరేషన్ చేపట్టి అవనిని హతమార్చారు.

ఆడ పులి అవనిని కాల్చి చంపిన తరువాత అనేక ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. ‘మనుషులను తినే పులి’ అంటూ కొన్ని వన్య ప్రాణులను  ఒక కేటగిరిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న ప్రధానంగా తెరమీద కు వచ్చింది. అసలు మనుషులను తినడానికి పులులు ఆసక్తి చూపుతాయా?  ఇది మరో ప్రశ్న.

చంపిన తరువాత మత్తు ఇచ్చారా? 

పులిని హతమార్చడానికి కొన్ని పద్ధతులున్నాయి. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం పులిని చంపాలనుకుంటే ముందుగా మత్తు ఎక్కడానికి ట్రాంక్విలైజర్స్ షూట్ చేయాలి. అవని విషయంలో ఈ రూల్స్ పక్కన పెట్టారు. అవని చనిపోయిన తరువాత నిర్వహించిన పంచనామా ప్రకారం చూస్తే తుపాకుల ద్వారా మత్తు ఇచ్చినట్లు లేదని, చేత్తో ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అవనిని చంపడానికి ఓ ప్రైవేట్ హంటర్​ని రంగంలో దింపడం కూడా కాంట్రవర్శీగా మారింది.

పులికి ఇప్పటికీ తగ్గని క్రేజ్ 

పులి రాజసానికి ప్రతీక. అడవిలో ఎన్ని జంతువులున్నా రారాజుగా పులినే పేర్కొంటారు. బెంగాల్ టైగర్​ మన జాతీయ జంతువు. మనదేశ చరిత్రలో కూడా పులికి చాలా ప్రాధాన్యం ఉంది. మనదేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్గాదేవి పులిమీద స్వారీ చేస్తున్న బొమ్మ కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పులిని శక్తికి ప్రతీక గా వాడతారు. ఎవరికీ భయపడకుండా వ్యవహరించేవారిని వాడుకలో  ‘పులి’ అని పిలుస్తుంటారు. 18వ శతాబ్దంలో మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్​కు పులి అంటే చాలా ఇష్టం ఉండేదట. దీంతో  ఓ పులిబొమ్మను చేయించి పెట్టుకున్నాడట.