ఎంపీ అభ్యర్థులు కావలెను..లోక్​సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట

ఎంపీ అభ్యర్థులు కావలెను..లోక్​సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట
  • మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత
  • అభ్యర్థులను డిసైడ్​ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్​
  • క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ 
  • బీఆర్ఎస్ ​పరిస్థితి దయనీయం.. ఉన్న కొద్దిమందీ పక్కచూపులు
  • జంపింగ్​లపైనా పార్టీల ఫోకస్.. 
  • పట్టు సాధించేందుకు ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికలకు టైమ్​ దగ్గరపడుతున్నా.. ఇంకా రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలోనే మునిగితేలుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో బలమైన లీడర్లు లేక దిక్కులు చూస్తున్నాయి. ఉన్నచోట ఎక్కువ మంది ఉండటం.. లేనిచోట అసలే లేకపోవడం పార్టీలను కలవరపెడుతున్నాయి. అవసరమైతే పక్క పార్టీలోని స్ట్రాంగ్​ లీడర్లను తమవైపు తిప్పుకొని బరిలోకి దింపాలని అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్​సభ నియోజకవర్గాలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్​కు అత్యధిక స్థానాల్లో స్ట్రాంగ్​ క్యాండిడేట్లు లేరు. ఈ విషయంలో బీజేపీ పరిస్థితి కాస్త బెటర్​గానే కనిపిస్తున్నా.. ఏడు సీట్లలో మాత్రం బలమైన లీడర్ల కోసం ఆ పార్టీ ఎదురుచూస్తున్నది. 

దాదాపు పది స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులున్నారు. అధికార కాంగ్రెస్​ పార్టీకి క్యాండిడేట్లను ఫైనల్​ చేయడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని సీట్లలో ఆ పార్టీ టికెట్  కోసం ఎక్కువ మంది స్ట్రాంగ్​ లీడర్లు పోటీ పడుతుండగా.. వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని బుజ్జగించాలో పార్టీ నాయకత్వం తేల్చుకోలేకపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్​ పరిస్థితి.. లోక్​సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మరింత దయనీయంగా తయారైంది. ఉన్నారనుకుంటున్న సిట్టింగ్​ ఎంపీలు కూడా ఒక్కొక్కరుగా ‘కారు’ దిగుతున్నారు. కొందరు పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు.

బీజేపీ: పది చోట్ల ఓకే.. 7 చోట్ల వెలితి

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి10 సీట్లలో గట్టి అభ్యర్థులు రెడీగా ఉన్నారు. మిగతా 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల వెలితి కనిపిస్తున్నది. ఆయా స్థానాల్లో సినీ ఇండస్ట్రీ లేదా ఇతర పార్టీల్లోని సిట్టింగ్​ల పేర్లను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. నిజామాబాద్​ నుంచి ధర్మపురి అర్వింద్​, సికింద్రాబాద్​ నుంచి కిషన్​ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్​ పేర్లు సిట్టింగుల జాబితాలో ఖరారైనట్టే కనిపిస్తున్నది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్​రెడ్డికి టికెట్​ దక్కినట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

మల్కాజ్​గిరి నుంచి ఈటల రాజేందర్, మురళీధర్​ రావు..  మహబూబ్​నగర్​ నుంచి డీకే అరుణ, జితేందర్​రెడ్డి, శాంతి కుమార్​ లాంటి స్ట్రాంగ్​ లీడర్లు కనిపిస్తున్నారు. మెదక్​ స్థానం నుంచి రఘునందన్​ రావు, అంజి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్​కు సిట్టింగ్​ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు. ఆయన కాకుండా ఆ స్థానం కోసం మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​, భైంసా మార్కెట్​ కమిటీ చైర్మన్​ రాజేశ్​ బాబు, ఆదివాసీ డాక్టర్​ సుమలత వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. నాగర్​కర్నూల్ నుంచి బంగారు శృతి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఇక్కడి నుంచి బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీ పి.రాములు లేదంటే ఆయన కుమారుడు భరత్​కు టికెటిచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 

రాములు బీఆర్​ఎస్​కు​ రాజీనామా చేసి.. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భువనగిరి నుంచి సీనియర్​ నేత బూర నర్సయ్య గౌడ్​తో పాటు వెదిరె శ్రీరామ్​ వంటి లీడర్లు రేసులో ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, జహీరాబాద్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థుల కొరత కనిపిస్తున్నది. నల్గొండలో జితేంద్రకుమార్, సైదిరెడ్డి, రాజారామ్​యాదవ్, చిన్నప్పరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఖమ్మంలో వినోద్​ రావు, డాక్టర్​ వెంకటేశ్వర్ల పేర్లు వినిపిస్తున్నాయి. జహీరాబాద్​లో సినీ నిర్మాత దిల్​రాజును బరిలో దింపాలన్న యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు చర్చ సాగుతున్నది. హైదరాబాద్ ​ఎంపీ టికెట్​ను విరించి హాస్పిటల్ ​చైర్​పర్సన్​ మాధవీలత  ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మహబూబాబాద్​లో హుస్సేన్​ నాయక్​, కృష్ణవేణి నాయక్  పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్​లో రిటైర్డ్​ ఐపీఎస్​ కృష్ణ ప్రసాద్​, సుభాష్​.. పెద్దపల్లిలో ఎస్.కుమార్​ వంటి నేతల పేర్లు తెరమీదికి వస్తున్నాయి. 

కాంగ్రెస్: ఉన్నచోట మస్తు.. లేనిచోట వెయిటింగ్​!

అధికార కాంగ్రెస్ ​పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లలో గెలిచి పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నది. బలమైన క్యాండిడేట్లను పోటీకి దించాలని అన్వేషిస్తున్నది. కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులే ఎక్కువ మంది ఉండటంతో.. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ  క్లారిటీకి రాలేకపోతున్నది. మరికొన్ని చోట్ల స్ట్రాంగ్​ లీడర్లు కనిపించడం లేదు. అలాంటి స్థానాల్లో ఎవరిని దింపితే బాగుంటుందన్న దానిపై పార్టీ కసరత్తు చేస్తున్నది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోటీ చేయించాలని అనుకుంటున్నా.. ఆయన ఆసక్తి చూపడం లేదని పార్టీలో చర్చ జరుగుతున్నది. వరంగల్​లో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, పోలీస్ ​అధికారి పుల్ల శోభన్​కుమార్, జెన్​కో ఇంజనీర్​ సదానందంతో పాటు పలువురు టికెట్​ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ​కంచుకోట అయిన నల్గొండలో క్యాండిడేట్​ను తేల్చలేని పరిస్థితిలో పార్టీ ఉంది. 

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ దక్కని పటేల్ రమేశ్ రెడ్డి, జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి రేసులో ఉన్నారు. భువనగిరి టికెట్​ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడి కుమారుడు సూర్య పవన్ రెడ్డి, సీఎం రేవంత్ అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆదిలాబాద్ ​ఎస్టీ రిజర్వుడ్ ​స్థానం నుంచి ఆదివాసీ, లంబాడీ నేతల్లో ఎవరిని పోటీకి దించాలో పార్టీ తేల్చుకోలేకపోతున్నది. ఇక్కడి నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్​ జాదవ్​ ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ కు సరైన అభ్యర్థి లేరు. 

మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు కుమారుడు రాజేందర్ రావు, రుద్ర సంతోష్  ఈ టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ ​నుంచి ఫిరోజ్​ ఖాన్​ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. చేవెళ్ల నుంచి వికారాబాద్​ జడ్పీ చైర్​పర్సన్​ సునీతా మహేందర్​రెడ్డి, బడంగ్​పేట్​ మేయర్​పారిజాతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్​ఆర్​ టికెట్​ఆశిస్తున్నారు. సికింద్రాబాద్ ​టికెట్ ​రేసులో మాజీ మేయర్​బొంతు  రామ్మోహన్, మోతె శోభన్​రెడ్డి, విద్యాసంస్థల అధినేత విద్య స్రవంతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమచారం. కాంగ్రెస్​బలంగా ఉన్న సీట్లలో ఖమ్మం ఒకటి. అయితే.. ఇక్కడ పలువురు బలమైన అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎవరికి టికెట్​ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి​ శ్రీనివాస్​రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు కొడుకు యుగేంధర్ టికెట్ రేసులో ఉన్నారు. 

వీవీసీ రాజేంద్ర ప్రసాద్, కుసుమ కుమార్ కూడా టికెట్ ​ఆశిస్తున్నారు. మల్కాజిగిరి టికెట్​ రేసులో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సినీ నిర్మాత బండ్ల గణేశ్, సినీ నటి విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. మెదక్ నుంచి నీలం మధు, సినీ నటి విజయశాంతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. జహీరాబాద్ ​టికెట్​ మాజీ ఎంపీ సురేశ్​ షెట్కర్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

పెద్దపల్లిలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి మనుమడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి కుమారుడు వంశీకృష్ణను పోటీకి దించే యోచనలో పార్టీ ఉన్నట్టు చర్చ నడుస్తున్నది. తాత, తండ్రి పెద్దపల్లి నుంచి ఎంపీలుగా పని చేయడం, విశాక ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో కాకా ఫ్యామిలీ వైపే మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత కూడా టికెట్​ఆశిస్తున్నారు. 

మహబూబ్​నగర్ ​టికెట్ ​వంశీచంద్​రెడ్డికే ఇస్తున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. మహబూబాబాద్ ​ఎంపీ స్థానం నుంచి పోటీకి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయబాయి, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్, ట్రాన్స్‌‌‌‌పోర్టు జాయింట్ కమిషనర్ పాండురంగా నాయక్  ఆసక్తి చూపిస్తున్నారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌: సిట్టింగ్​లు కూడా ముందుకొస్తలే

లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు నాయకులు వెనుకంజ వేస్తున్నారు. మెదక్‌‌‌‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పెద్దపల్లి ఎంపీగా గెలిచిన వెంకటేశ్‌‌‌‌ నేత కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరుతున్నారు. దీంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సిట్టింగ్​ ఎంపీల సంఖ్య ఆరుకు తగ్గింది. వారిలో ఇద్దరు ముగ్గురు పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఖమ్మం, చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీలకే సీట్లివ్వాలని బీఆర్​ఎస్​ భావిస్తున్నప్పటికీ.. ఖమ్మంలో పోటీకి సిట్టింగ్​ ఎంపీ నామా నాగేశ్వర్​రావు ఆసక్తి చూపడం లేదని టాక్. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి పోటీకి ఇంట్రస్ట్​ చూపడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. గెలుస్తామని ఆశలుపెట్టుకున్న మెదక్​లో కూడా బీఆర్​ఎస్​కు బలమైన అభ్యర్థి కనిపించడం లేదు. 

ఇక్కడి నుంచి వంటేరు ప్రతాప్‌‌‌‌రెడ్డి, పద్మా దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. కరీంనగర్ నుంచి వినోద్‌‌‌‌ కుమార్, చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్‌‌‌‌రెడ్డి, జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌‌‌‌ రేసులో ఉన్నారు. వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌‌‌‌ పేర్లు పరిశీనలో ఉన్నాయి. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. మహబూబ్‌‌‌‌నగర్ నుంచి నిరంజన్‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌గౌడ్, లక్ష్మారెడ్డిలో ఒకరిని పోటీ చేయించాలని పార్టీ భావిస్తున్నది.ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, గొడెం నగేశ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. భువనగిరి నుంచి క్యామ మల్లేశం, బూడిద భిక్షమయ్యగౌడ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు.

ఒక్కో పార్టీది ఒక్కో కథ

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. లోక్​సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలువాలని చూస్తున్నది. జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్​నగర్​, మహబూబాబాద్​ లోక్​సభ స్థానాలపై ఇప్పటి వరకు కాంగ్రెస్​లో కొంత స్పష్టత కనిపిస్తున్నది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి స్థానాల్లో ఎక్కువ మంది స్ట్రాంగ్​ లీడర్లు పోటీకి ఇంట్రస్ట్​ చూపుతుండటంతో ఎవరికి టికెట్​ ఇవ్వాలో పార్టీ తేల్చుకోలేకపోతున్నది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్,  నాగర్​కర్నూల్, హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్​గిరి, మెదక్ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నది. బీజేపీకి మెదక్​, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్​గిరి, ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, భువనగిరి స్థానాల్లో బలమైన లీడర్లు ఉన్నారు. 

టికెట్​పై ధీమా ఉన్న బీజేపీ నాయకుల్లో కొందరు ఇప్పటికే ఫీల్డ్​లోకి దిగి పని చేసుకుంటున్నారు. మహబూబాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్​ స్థానాల్లో బలమైన లీడర్ల కోసం కమలం పార్టీ వెతుకుతున్నది. బీఆర్ఎస్​కు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్​ స్థానాల్లో మాత్రమే గట్టి లీడర్లు కనిపిస్తున్నారు. అయితే.. వారిలోనూ కొందరు పోటీకి ఇంట్రెస్ట్​ చూపడం లేదు. బీఆర్​ఎస్​లోని కొందరు సిట్టింగ్​ ఎంపీలు ఇతర పార్టీలతో టచ్​లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆ పార్టీ పెద్దపల్లి సిట్టింగ్​ ఎంపీ కాంగ్రెస్​లో చేరగా.. నాగర్​కర్నూల్​ సిట్టింగ్​ ఎంపీ బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 

పార్టీల వారీగా స్ట్రాంగ్​ లీడర్లు ఉన్న సీట్లు.. 

    బీజేపీ: మెదక్​, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్​గిరి, ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, భువనగిరి
    కాంగ్రెస్: జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబ్​నగర్​, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం
    బీఆర్ఎస్: కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్​, ఖమ్మం