
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ మహదేవ్’ టైమింగ్ సరికాదని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆ మిలిటరీ యాక్షన్తో రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ పై మంగళవారం (జులై 29) లోక్ సభలో జరిగిన చర్చలో అఖిలేశ్ మాట్లాడారు.
‘‘సోమవారమే ఆపరేషన్ మహదేవ్ ఎందుకు చేపట్టారు? టైమింగ్ కరెక్ట్ గా ఉన్నపుడు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. కానీ, సోమవారం చేపట్టిన ఆపరేషన్ కు నేను మద్దతు తెలపడం లేదు. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేపట్టిన టైమింగ్ కరెక్టు కాదు. అంతేకాకుండా ఈ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేయాలనుకుంటోంది. అలాగే, 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిపైనా నాకు కొన్ని సందేహాలున్నాయి. పేలుడు పదార్థాలతో ప్రవేశించిన ఆ వాహనంలో అవి ఎక్కడి నుంచి వచ్చాయి? దీనిపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తుకు ఆదేశించడం లేదు? ప్రభుత్వానికి ధైర్యం లేదా?” అని అఖిలేశ్ ప్రశ్నించారు.