టిప్ చాలెంజ్: 2020 డాలర్లు టిప్ ఇచ్చిన అమెరికన్ సింగర్

టిప్ చాలెంజ్: 2020 డాలర్లు టిప్ ఇచ్చిన అమెరికన్ సింగర్

78 డాలర్ల బిల్లుకు 2020 డాలర్ల టిప్

ఐస్ బకెట్ చాలెంజ్, కికీ చాలెంజ్, 10 ఇయర్ చాలెంజ్ ఇవన్నీ 2019లో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇప్పుడు అదే కోవలో మరో చాలెంజ్ ట్రెండింగ్‌లో నిలిచింది. 2020 కొత్త సంవత్సరం సందర్భంగా వచ్చిందే 2020 టిప్ చాలెంజ్. ఈ చాలెంజ్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. మనం రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు అక్కడున్న హోటల్ సర్వర్లు మనకు ఏంకావాలో అడిగి, తీసుకొచ్చి వడ్డిస్తారు. అలా చేసినందుకు భోజనం తర్వాత వారికి ఎంతో కొంత టిప్ ఇస్తాము. అదే 2020 టిప్ చాలెంజ్.

ఈ చాలెంజ్‌ను స్వీకరించిన అమెరికన్ సింగర్ కమ్ యాక్టర్ డోన్ని వాల్బెర్గ్ తనకు సర్వ్ చేసిన వెయిట్రస్‌కు ఏకంగా 2020 డాలర్లు టిప్‌గా ఇచ్చాడు. డోన్ని 2020 జనవరి 1న ఇల్లినాయిస్‌ సెయింట్ చార్లెస్‌లోని IHOP అవుట్‌లెట్‌‌కి వెళ్లారు. అక్కడ ఆయన తిన్న తర్వాత ఆయనకు వడ్డించిన వెయిట్రస్ డేనియల్ ఫ్రాంజోనికి ఏకంగా 2020 డాలర్లను టిప్‌గా ఇచ్చాడు. డోన్ని రెస్టారెంట్‌లో తిన్నదానికి అయిన బిల్ 78 డాలర్లు. ఆ బిల్లుకు మరో 2020 డాలర్లు కలిపి మొత్తంగా 2098 డాలర్లు డోన్ని చెల్లించాడు. ఆ బిల్లులో 2020 డాలర్లు టిప్‌గా ఇస్తున్నట్లు ప్రింట్ అయింది. డోన్ని ఆ బిల్లుపై హ్యాపీ న్యూఇయర్, 2020 టిప్ చాలెంజ్ అని రాశాడు.

డోన్ని అంత మొత్తాన్ని టిప్‌గా ఇచ్చేసరికి వెయిట్రస్ డేనియల్ ఆనందానికి అంతులేకుండా పోయింది. తనకు సొంత ఇల్లు లేదని, ఆ డబ్బుతో సొంత ఇల్లు నిర్మించుకుంటానని ఆమె తెలిపింది. అంతేకాకుండా ఆ డబ్బు తన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని డేనియల్ సంతోష పడుతూ తెలిపింది. ఆ డబ్బులో కొంత మొత్తాన్ని ఉపయోగించి తన డ్రైవింగ్ లైసెన్స్‌ని తీసుకుంటానని ఆమె చెప్పింది.

డోన్ని చేసిన ఈ పనిని ఆయన భార్య జెన్నీ మెక్ కార్తీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2020 టిప్ ఛాలెంజ్ 2018లో వచ్చిన ‘టిప్ ది బిల్’ ఛాలెంజ్ మాదిరిగానే ఉంటుంది.