జీవితం ఎప్పుడూ ఒక అసంతృప్తి వెంటాడుతుంటుంది. ఎన్నడూ సంతోషం లేకపోయేసరికి ఎప్పుడో ఒకప్పుడు ఆనందం గురించి మనసు ఆలోచిస్తది. ఆనందం ఎక్కడుంటది? అది దేవుడిస్తడా?' అని ఆలోచిస్తరు. ఆనందంగా బతకాలని ఆలోచించడం. కంటే ఎట్ల బతకాలో, ఎందుకు బతకాలనో తెలుసుకుంటే లైఫ్ లోకి హ్యాపీనెస్ వస్తది.
మనిషి ప్రతి దాని నుంచి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తడు. ప్రతి వస్తువు నుంచి ఏదో ఒక లాభం ఉండాలె అనుకుంటడు. ఎదుటి మనిషితోని గూడ ఏదో ఒక ఉపయోగం ఉండాలనుకుంటాడు. ఉపయోగం కోరుకునే ఆలోచనలు లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నయ్. కానీ, అన్నిటి నుంచీ ఉపయోగాన్ని ఆశించడం, ఉపయోగం కోసమే ఉన్నాయనుకోవడం తప్పు. ఆ ఉపయోగం లేనప్పుడు అసంతృప్తి మొదలైతది బాధపడతరు. మనసులోంచి ఆనందం చెదిరిపోతది.
పువ్వు లాంటి లవ్వు
ఒక కొమ్మకు పూలు పూస్తయ్. ఆ పూలు సువాసన వెదజల్లుతాయ్. అటుగా దారిల పోతున్న మనిషి ఆ సువాసనని ఆస్వాదిస్తడు. ఆనందంగ ఫీలయితడు. అది భ్రమ. నిజమేమిటంటే?.. అలాంటి చెట్లు మనిషి సంచారం లేని చోట కూడా ఉంటయ్. వాటికొమ్మలకూ పూలు పూస్తయ్.ఆ పూలు గూడా సువాసన ఇస్తయ్. మనిషి కోసమనిపూలు సువాసన ఇయ్యవు. పూయడం, సువాసన ఇయ్యడం చెట్టు లక్షణం. నదులు ప్రవహిస్తయి. నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తయి. మేఘాలు కదులుతయి.
ఇవన్నీ మనిషి కోసం కాదు. వాటి లక్షణాలు అట్లనే ప్రతి మనిషికీ ఓ లక్షణం ఉంటుంది. వాటిని నిలుపుకోవడమే జీవితం. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటది. నది ఏ ఉద్దేశంతో ప్రవహించదు. పూలు ఓ లక్ష్యం కోసం సువాసన ఇయ్యవు. అట్లనే జీవితానికి ఓ లక్ష్యం, ఉద్దేశం, కారణం ఉండకూడదు. అదే అసలైన జీవితం. అప్పుడే అసలైన ఆనందం అనుభవంలోకి వస్తది.
మహా భారతంలోని శ్రీకృష్ణుడు ఇలాంటి వాడే. కృష్ణుడికి లక్ష్యం లేదు. ఉద్దేశం లేదు. దేని నుంచి ఎవరి నుంచి ప్రయోజనం ఆశించడు. తన ఆనందం కోసం, ఆత్మానందం కోసం జీవించిండు. మనుషులందరు కృష్ణుడి లెక్కే ప్రేమ కోసమే పుడతరు. గానీ, ప్రేమతో జీవించలేకపోతున్నరు. అందుకే మనం హ్యాపీగా లేము. ఈ యుగమంతా దుఃఖంలనే ఉంది.
అనుకరిస్తే అంతే సంగతి
జీవితానికి ప్రయోజనం, ఉద్దేశం, కారణం లేవు.జీవితం కోసమే జీవించాలె. అయినా అందరూ తామేమిటో దాచనీకి ట్రై చేస్తరు. ముసుగులు తొడుక్కుంటారు. నిజమైన ముఖాన్ని దాచుకుంటరు. మనమేంటో దాచనికి ట్రై చేయడం. మనమేది కాదో అదని చెప్పనీకి ట్రై చేస్తుంటారు.
ఇట్లాంటప్పుడు తమ చైతన్యాన్ని (తమను తాము) అణిచివేసుకుంటరు. ఆ విషయం వాళ్లకు తెలియదు.ఈ మనసుకు వేసుకున్నంక అనుకరణ మొదలుపెడతరు. అనుకరించడమంటే తమను తాము అవమానించుకోవడమే. అనుకరణ హీనమైన స్థితి అనుకరించడం మొదలైందంటే తనను తాను నాశనం చేసుకోడం మొదలైందని అర్ధం.
ఏ గొప్పవ్యక్తీ ఇతరులకు అనుసరణీయం కాదు. వాళ్లను స్టడీ చేసి సరిగా అర్థం చేసుకోవాలి అంతే! అట్లనే జ్ఞానులందర్నీ పరిగణించి, అర్ధం చేసుకోవాలె. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆలోచన, ఆచరణ, క్రమశిక్షణ ఉంటది. వాటికి గూడ పరిమితులుంటయి. ఆటంకాలుంటాయి. అందుకని ఒకరిని అనుకరించొద్దు. వాళ్లకున్న పరిమితులు వేరు. మీకున్న పరిమితులు వేరు. కాబట్టి ఇబ్బంది పడుతరు. ఆటంకాలు గూడా వేరుగనే ఉంటాయి. అనుకరిస్తే చివరికి మిమ్మల్ని మీరు కోల్పోతరు. మీ లైఫ్ బాధ తప్ప ఆనందం ఉండదు.
ప్రేమలోనే హ్యాపీ
జీవితం ఏదో ఒక ప్రయోజనం ఆశించేది కాదు. లైఫ్ ఏ ప్రయోజనానికి కానీ, లక్ష్యానికీ ఉపయోగపడని ఒక లీల. జీవితం ఒక ఆట. మనమంతా అన్ని విషయాల్లో ప్రయోజనం ఆశించట్లే. కొన్ని విషయాల్లో ఇంకా ప్రయోజనం ఆశించకుండనే ఉంటన్నం కాబట్టే కొద్దిగ సంతోషంగా ఉంటున్నం. ఉపయోగాన్ని ఆశించే లైఫ్ కి, ఉపయోగం ఆశించని లైఫ్ కి చాలా తేడా ఉంటది.
అదెట్లుంటదంటే?.. మీరు పొద్దున ఆఫీసుకి బయలుదేరుతరు. బజార్ల భారంగా నడుచుకుంట పోతరు. మాపటికి నీరసంగ ఇంటికిపోతరు. ఇంటినుంచి కాలక్షేపం కోసం వాకింగ్ కి పోతరు. అదే మనిషి. అదే బజారు. కానీ పొద్దున భారంగ పోతరు. సాయంత్రం నీరసంగ వస్తరు. అదే వాకింగ్ కి మాత్రం ఉత్సాహంగ వస్తరు. హ్యాపీగా ఫీలైతరు.
ఆఫీసుకి పోయేటప్పుడు ఒక ప్రయోజనాన్ని ఆశించి పోతున్నరు. వాకింగ్ కు పోయినప్పుడు ఏ ప్రయోజనం కోసం బయలెల్లలేదు. అదే తేడా. ప్రయోజనాన్ని ఆశించని లైప్ల హ్యాపీనెస్ ఉంటది. ప్రేమలో ఉన్నోళ్లకు తగువులు ప్రయోజనం కోరుకోవడం వల్లే వస్తయి. అవసరం కోసం షరతులతో ప్రేమిస్తరు. ఆ ప్రేమకు బంధమనే పేరొకటి పెడుతరు. అవసరాలు, షరతులు ఉంటే... అది కల్తీ ప్రేమ.
ధార్మిక ప్రేమ
ఏ కారణం లేకుండ, ఏ ఉద్దేశం లేకుండ. ఏ షరతులు లేకుండ ఏదైనా పని మీ లైఫ్ లో చేస్తరో అప్పుడే దానిపట్ల మీకు ప్రేమ ఉన్నట్టు. ప్రేమతో చేయడంవలనే ఆనందం ఉన్నది. ఆనందం కోసం ప్రేమించినప్పుడే ధర్మం, దైవం అంటే ఏమిటో తెలుస్తది. ఏదీ ఆశించకుండ, ఏ ఉద్దేశం లేకుండ ఒక పని చేయడం మొదలు పెడితేనే ఎవరైనా ధార్మికంగ ఉండగలరు,
పాండవులల్ల, కౌరవులల్ల సుగుణాలు ఎట్లున్నయో. వ్యసనాలూ అట్లనే ఉన్నయ్. లోకంలో అతి ఉత్తముల లైఫ్ లో గూడా ఎంతో కొంత చెడు ఉంటది. ప్రతి ఒక్కరి లైఫ్ లో మంచిచెడులుంటయ్. అందుల మంచి ఎంత? చెడు ఎంత?'అన్నదే లెక్క. ఈ మంచిచెడుల్ని బట్టే మనం ఎవరిని పరిగణించాలి. ఎవరిని పరిగణించగూడదో చెప్తది.
–వెలుగు,లైఫ్–
