వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన శనివారం ( అక్టోబర్ 21)   …. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

సూర్యప్రభ వాహనంపై స్వామి దర్శనం – ఆయురారోగ్యప్రాప్తి

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులతో పాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.


సూర్య ఆత్మ జగత: తస్థుషశ్చ’ అని వేదవాక్యం.

అనగా కదిలే వాటికి కదలని వాటికి సూర్యుడే ఆత్మ అని అర్థం. తన కిరణాల ద్వారా భూమి పై ఉన్న జలాన్ని తీసుకొని, ఆకాశంలో మేఘాలుగా మార్చి భూమిపై వర్షం కురిపిస్తాడు సూర్యుడు. ఆ నీటితో చెట్లు, గడ్డి పెరిగితే వాటితో పశువులు బ్రతుకుతాయి, పంటలు పండి సకల మానవులకు జీవనాధారమవుతాయి. ఆ పంటలతో పురోడాశాన్ని తయారుచేసి దాన్ని హవిస్సుగా అగ్నిలో వేస్తారు. గడ్డిని ఆహారముగా తీసుకున్న గోవులు పాలిస్తే ఆ పాలను పెరుగుగా, దాన్ని చిలికి వెన్నగా, దాన్ని కరిగించి నెయ్యిగా చేసి ఆ నెయ్యితో హోమం చేస్తారు. హోమంలోని ఆహుతులను తీసుకున్న సూర్యభగవానుడు వర్షాన్ని కురిపిస్తాడు. సూర్యుని ఎండే చంద్రునిలో చేరి వెన్నెలవుతుంది. వారిద్దరి కలయికతో మంచు ఏర్పడుతుంది. మంచుతో పంటలు పండుతాయి. వెన్నలతో పంటలు పెరుగుతాయి. ఎండతో ప్రాణుల ఆరోగ్యం సమకూరుతుంది. ఇలా సకల జగములకు సూర్యుడే ఆధారం.

వయస్సు, సంవత్సరము, అయనము, మాసము, పక్షము, వారము అను కాలగణనకు, లెక్కలకు ఆధారం సూర్యుడే. ఆ సూర్యుని ప్రభా అంటే సూర్యమండల మధ్యవర్తి అయిన నారాయణుని ప్రభే అందుకే ‘ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ: సరసిజాసన సన్నివిష్ట:’ అని చెప్పబడుతున్నాడు సూర్యుడు. సూర్యప్రభ అంటే తన తేజస్సుతోనే, తన తేజస్సునే తనను లోకానికి సాక్షాత్కరింప చేస్తాడని అర్థం. అంటే భగవంతుడిని చూపేది, భగవంతుని తేజస్సే అంటే జ్ఞానమే. సూర్యప్రభ వాహనం అంటే జ్ఞానమే వాహనమని అర్థం. సూర్యమండల మధ్యలో ఉండేవాడు నారాయణుడే కావున అతడిని సూర్యనారాయణడు అంటారు .