
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుల నేపథ్యం లో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్ల కౌంటర్ దగ్గర గందరగోళ వాతావరణం నెలకొంది. శ్రీవాణి దర్శన టికెట్ల సమయాన్ని మార్చిన తరువాత అధికారికంగా ఉదయం 10.30 గంటలకు టికెట్లు జారీ చేస్తామని ప్రకటించడంతో.. అర్దరాత్రి నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు.
అయితే భక్తుల తాకిడి ఎక్కువుగా ఉండటంతో అర్దరాత్రే టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. శ్రీవాణి టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసన తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువుగా ఉండటంతో రాత్రి క్యూలైన్ల దగ్గర తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులకు సర్ది చెప్పారు. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 800 టికెట్లను ఆఫ్ లైన్ లో టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఒక్కో టికెట్ రూ. 10 వేల 500 లకు విక్రయిస్తారు.
తిరుమల కొండ కిటకిటలాడుతుంది.శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. తిరుమల కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు బారులు తీరారు.
నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్భవనం నుంచి క్యూ లైన్ లోకి పంపిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు అన్న ప్రసాదాలు.. నీరు.. పాలు అందిస్తున్నారు.