తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు క్యూ కాంప్లెక్స్ బయట కూడా వేచి ఉన్నారు. ఆషాఢమాసం కావడంతో గత కొద్ది రోజులుగా తిరుమల భక్తుల రద్దీ తగ్గింది. కానీ శుక్రవారం( జూన్ 30)  భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలొచ్చారు.   ఇక శనివారం ( జులై1)కూడా  తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. నిన్న (జూన్ 30)  శ్రీవారిని 73,572 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న (జూన్ 30)  శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,448 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.శనివారం ( జులై1) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్యూ లైన్లలో ఉన్నవారికి అన్నపానీయాలు అందిస్తున్నారు.

జులై 1న శని త్రయోదశి, జూలై 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురు పూర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 13న సర్వ ఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది