తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

తిరుమలలో బోనులో చిక్కిన చిరుత

తిరుమల అలిపిరిలోని 7వ  మైలు దగ్గర బాలుడిపై దాడి చేసిన చిరుత చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో జూన్ 23వ తేదీ  శుక్రవారం రాత్రి 10.45 గంటలకు చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. ఈ చిరుతకు ఏడాదిన్నర వయసు ఉంటుందన్నారు.  ఒక్కరోజులోనే చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఓ పిల్లిని వేటాడుతూ భక్తులు వెళ్లే మార్గంవైపు చిరుత వెళ్లిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పిల్లి తప్పించుకోవడంతో అదే సమయంలో కనిపించిన బాలుడిపై దాడి చేసిందన్నారు. ఈ చిరుత తల్లి నుంచి వేరుగా ఉంటోందని...అయితే.. పిల్లి అనుకుని బాలుడిని వేటాడేందుకు  ప్రయత్నం చేసిందన్నారు.

చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అలిపిరి నడకదారి మార్గంలో జూన్ 23వ తేదీ  శుక్రవారం సాయంత్రం రెండు బోనులు ఏర్పాటు చేశారు. 100కుపైగా కెమెరాలు ఏర్పాటు చేశారు.

జూన్ 22వ తేదీ గురువారం రాత్రి తిరుమల -అలిపిరి నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. మొదటి ఘాట్‌ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో కూర్చుని ఆహారం తీసుకుంటున్నారు. ఆ సమయంలో బాలుడు వారి పక్కనే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత పులి, చిన్నారి తలను నోటకరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. అక్కడే ఉన్న దుకాణదారుడు, బాలుడి తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ పులి వెనుక పరుగులు తీశారు. కొద్దిదూరం తర్వాత విడిచిపెట్టింది. చిన్నారిని చిరుత నోటకరుచుకుని పోవడంతో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డాడు. బాలుడి తల్లిదండ్రులు చిరుత వెంట పడటంతో బాలుడిని వదిలేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.