శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనం టోకెన్లు రద్దు.. ఎప్పుడంటే.

శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనం టోకెన్లు రద్దు.. ఎప్పుడంటే.

తిరుమల శ్రీవారి భక్తులకు ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజల సందర్భంగా ఉచిత దర్శనం టోకెన్లు రద్దు చేశారు. డిసెంబ‌రు 22న అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ ర‌ద్దు చేసింది.  తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభంకానుంది. డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భ‌క్తులు తిరుమ‌ల‌లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వద‌ర్శనంలో ఆరోజు శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. 

డిసెంబ‌రు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి తిరుప‌తిలోని తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార ద‌ర్శన టోకెన్ల జారీ ప్రారంభమవుతుంది. టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా టోకెన్ల జారీ జరుగుతుంది. డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి నాడు ఉదయం 9 నుండి 10 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు ద‌ర్శన‌మిస్తారు. డిసెంబ‌రు 23న  తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో గ‌ల 700 శ్లోకాలతో సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం చేస్తారు. సాయంత్రం 6 గంట‌ల నుండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయ‌ణం నిర్వహిస్తారు.

 డిసెంబ‌రు 22 నుంచి 24వ తేదీ వ‌ర‌కు, డిసెంబ‌రు 31, జ‌న‌వ‌రి 1వ తేదీల్లో శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. స‌హ‌స్ర దీపాలంకార సేవ‌ను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ ప‌ది రోజుల పాటు ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వహిస్తారు. 10 రోజుల పాటు సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. అంతేకాదు ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమల రావాలని టీటీడీ సూచిస్తోంది.. టికెట్లు లేని వారు కూడా రావొచ్చు కానీ దర్శనానికి అనుమతించరని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.