తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(అక్టోబర్ 01) తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసింది. అదేవిధంగా అక్టోబర్ నెల 7, 8, 14, 15 తేదీల్లోనూ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 

తిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం(సెప్టెంబర్ 30) భక్తులు పోటెత్తారు. పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు మొత్తం భక్తులతో నిండిపోయాయి.

నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 

తిరుమలకు భక్తులు పోటెత్తడంతో అలిపిరి దగ్గర ఉన్న పార్కింగ్  ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుండి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన బస్సులను పార్కింగ్ చేశారు. శుక్రవారం(సెప్టెంబర్ 29) నుంచి ఈరోజు(సెప్టెంబర్ 30) వరకు అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి.