
తిరుమల, వెలుగు: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం రాత్రి 7 గంటల వరకు లక్ష మందికిపైగా భక్తులు తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి, ఆలయ మాడ వీధుల్లోని షెడ్లలోకి భక్తులను అనుమతించారు. ఆదివారం అర్ధరాత్రి 12.30 నుండి 2 గంటల మద్య తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. తర్వాత భక్తులకు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తారు. సోమవారం ఉదయం 5 గంటల నుండి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతలను దర్శనానికి అనుమతిస్తారు. సోమవారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.
వైకుంఠ ద్వార దర్శనం రెండ్రోజులే
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటివరకు అమల్లో ఉన్న సంప్రదాయాన్నే కొనసాగిస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుపతికి చెందిన తాళ్లపాక రాఘవన్ వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరిస్తే ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటానే విషయమై హైకోర్టులో పిల్ వేశారని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమై రెండ్రోజులే వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించామని, ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదిస్తామన్నారు.
సబ్సిడీ లడ్డూలు రద్దు: టీటీడీ చైర్మన్
ఈ నెల 20 నుండి శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఉచిత లడ్డూ అందజేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రూ.50 చొప్పున భక్తులకు కావాల్సినన్ని అదనపు లడ్డూలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇప్పటివరకు కాలినడకన వచ్చే భక్తులకే ఉచితంగా లడ్డూ ఇస్తున్నట్లు తెలిపారు.
శ్రీవారి ఆలయం ముస్తాబు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనం కోసం శ్రీవారి ఆలయం ముస్తాబైంది. ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక కటౌట్ ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. పడికావలి నుండి సన్నిధి వరకు, ధ్వజస్తంభం, బలిపీఠంతోపాటు వైకుంఠ ద్వార ప్రవేశ మార్గంలో పుష్పాలంకరణ చేశారు.