కోటి రూపాయల తిరుమల బస్సు కొట్టేసిన కేడీ అరెస్ట్

కోటి రూపాయల తిరుమల బస్సు కొట్టేసిన కేడీ అరెస్ట్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో  రెండు కోట్ల విలువైన శ్రీ వారి ఉచిత ఎలక్ట్రిక్ బస్సు చోరీ  కేసును పోలీసులు చేధించారు. సెప్టెంబర్  24న బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఎలక్ట్రికల్ బస్సు అపహరణకు గురైంది.  టీటీడీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు  అక్టోబర్ 2 వ తేదీన తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దొంగను పట్టుకున్నారు.  నిందితుని నుంచి దొంగిలించిన ఎలక్ట్రికల్ బస్సు తాళం చెవిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   నిందితుడిని మహారాష్ట్రకు చెందిన నిలావర్ విష్ణుగా గుర్తించారు.  అతని తల్లి దండ్రులు హైదరాబాద్ లో నివసించేవారు.  అయితే విష్ణు తల్లిని అతని తండ్రి 2015లో హత్య చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.  అనంతరం ముద్దాయి విష్ణు, అతని అక్కను హైదరాబాద్ పోలీసులు సైదాబాద్ ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రంలో చేర్పించారు. 2020 సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు రాసిన అనంతరం డాన్ బాస్కో చేతివృత్తులు నేర్పించే కేంద్రానికి తరలించారు. అయితే 2021 సంవత్సరంలో విష్ణు  సైకిల్ దొంగతనం చేసి పారిపోయాడు.  అప్పటి నుంచి జల్సాలకు అలవాటు పడిన ముద్దాయి పలు నేరాలకు  పాల్పడినట్లు తమ విచారణలో వైల్లడైందని పోలీసులు తెలిపారు.   ఈ క్రమంలోనూ తిరుమలకు వచ్చిన ముద్దాయి.. యాత్రికుల బస్సులో ఫ్రీగా తిరుగుతూ.. అదను చూసుకొని బస్సును దొంగిలించాడు.

ఎలాంటి ఆధారాలు లేని కేసును చేధించడంలో ప్రతిభ చూపిన అదనపు ఎస్పీ విమల కుమారి , తిరుపతి క్రైమ్ డిఎస్పి రవికుమార్,తిరుమల వన్ టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి క్రైమ్ సీఐ అమర్నాథరెడ్డి, క్రైమ్ పార్టీ సిబ్బంది ఏఎస్ఐ నాగరాజు, హెచ్ సిలు నాగరాజు, రవి ప్రకాష్ పిసీలు వేణుగోపాల్ నాగరాజు శెట్టి వారిని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి అభినందించి రివార్డులు ప్రకటించారు.