తిరుపతి టు రక్సౌల్ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు.. పచ్చజెండా ఊపిన ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే..

 తిరుపతి టు రక్సౌల్ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు.. పచ్చజెండా ఊపిన ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే..

తిరుపతి నుంచి బీహార్‌లోని రక్సౌల్‌కు వెళ్లే కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు (రైలు నెంబర్లు: 17433/17434) ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతి రైల్వే స్టేషన్‌లోని 6వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే శ్రీనివాసులు, రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డిసిఎమ్) మోహన్ కృష్ణ కలిసి పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.

గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత, రైలు ఉదయం 8:15 గంటలకు తిరుపతి నుంచి రక్సౌల్‌కు బయలుదేరింది.

ప్రత్యేక రైలు నుంచి శాశ్వత రైలుగా..
గతంలో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 07051/07052 నెంబర్లతో  స్పెషల్ రైలుగా నడిపేవారు. అయితే ప్రయాణికుల అవసరాలను గుర్తించిన రైల్వే శాఖ, ఇప్పుడు దీనిని  రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చింది.

ప్రయాణించే మార్గం:
ఈ రైలు తిరుపతి నుంచి బయలుదేరి ముఖ్యమైన ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తులైన  రేణిగుంట, కడప, గుంతకల్, రాయచూర్, వికారాబాద్ మార్గాల ద్వారా ప్రయాణించి సాయంత్రానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ నుంచి చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ ఇతర ముఖ్య స్టేషన్ల మీదుగా వెళ్తుంది. మొత్తం సుమారు 2,795 కిలోమీటర్లు ప్రయాణించి ఈ రైలు చివరిగా రక్సౌల్ జంక్షన్‌కు చేరుకుంటుంది.

ఈ కొత్త రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను గుంతకల్ డివిజనల్ వాణిజ్య అధికారి, తిరుపతి స్టేషన్ డైరెక్టర్ మోహన కృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు, ముఖ్యంగా కార్మికులకు, భక్తులకు ఎంతో లబ్ధి చేకూరనుంది.