డిసెంబర్​ 17 నుంచి తిరుమలలో తిరుప్పావై పారాయణం

డిసెంబర్​ 17 నుంచి తిరుమలలో తిరుప్పావై పారాయణం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా డిసెంబరు 17 నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పెరియ కోయిల్ కేల్విఅప్పన్ శఠగోప రామానుజ పెద్ద జీయర్ స్వామి మఠంలో నెల రోజుల పాటు ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు. 

 టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.  తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంతోపాటు ఏడు ప్రాంతాల్లో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు

 ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది’ అని తెలిపింది.‘ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది’ అని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది.

 విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్ద జీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్ స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.