- గుర్తింపు కమిటీకి ప్రతిపాదనలు త్వరలోనే సీఎంకు నివేదిక: చైర్పర్సన్ కే కేశవరావు
హైదరాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియకు నాటి టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం అమరవీరుల స్మారక చిహ్నం కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించింది.
ఉద్యమ కాలంలో యావత్ తెలంగాణను ఏకతాటిపైకి తెచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు నాటి ఉద్యోగ, ఉపాధ్యాయ, రవాణా, న్యాయవాద, సామాజిక రంగాల జేఏసీ ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాటి స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ అనుబంధాలతో ఏమాత్రం సంబంధం లేకుండా, నిజమైన పోరాట యోధులను ఖచ్చితంగా గుర్తించే విధివిధానాలపై ఈ కమిటీకి తమ సలహాలు, సూచనలను రాతపూర్వకంగా అందజేశారు.
ప్యానల్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో, ఉద్యమకారుల సంక్షేమం కోసం చరిత్రాత్మక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి సంఘీభావాన్ని ప్రకటించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ రంగాల ప్రతినిధులు, ఉద్యమ శ్రేణుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా పటిష్టమైన డిమాండ్లు, సంక్షేమ సూచనలను ప్యానల్ ముందు ఉంచారు. క్షేత్రస్థాయిలో లాఠీదెబ్బలు తిని, జైలుకు వెళ్లి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన ప్రతి నిజమైన పోరాట యోధునికి పార్టీల హద్దులతో సంబంధం లేకుండా అధికారిక ప్రభుత్వ ప్రశంసాపత్రం మంజూరు చేయాలని కోరారు.
అలాగే ఇండ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకునేందుకు కనీసం 250 గజాల నివాస స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులకు ప్రత్యేక ఆసరా పెన్షన్లతో పాటు, ఉచిత కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పించేందుకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించాలని ప్రతిపాదనలు సమర్పించారు.
పారదర్శకంగా తుది నివేదిక..
టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుల నుంచి వ్యక్తమైన ఏకగ్రీవ మద్దతును గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోతె శోభన్ రెడ్డి స్వాగతించారు. పార్టీలకతీతంగా నాటి ఉమ్మడి స్టీరింగ్ కమిటీ డైరెక్టరీ ఆధారంగా లభించిన ఈ సంపూర్ణ సహకారం ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తుందని ప్యానల్ స్పష్టం చేసింది. అర్హులైన చివరి ఉద్యమకారుడిని సైతం ఎలాంటి తప్పులు లేకుండా గుర్తించడమే తమ కమిటీ ప్రధాన లక్ష్యమని చైర్మన్ ఈ సందర్భంగా ప్రకటించారు.
సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ స్క్రీనింగ్ ఆధారంగా డేటాను పటిష్టంగా విశ్లేషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్క్రీనింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అత్యంత పారదర్శకమైన, సమగ్రమైన తుది నివేదికను తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామన్నారు.
ప్రతిపాదనలు అందజేసింది వీరే..
సమావేశంలో టీజీవో తరఫున వి. శ్రీనివాస్ గౌడ్, ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవో తరఫున కె. స్వామిగౌడ్, జి. దేవీప్రసాద్, కారం రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ తరఫున దొంతు ఆనందం, రాజిరెడ్డి, ఎలక్ట్రిసిటీ జేఏసీ నుంచి కె. రఘు ఉన్నారు. న్యాయవాదుల తరఫున ఎమ్.రాజేంద్ర రెడ్డి, ఎన్.ప్రహ్లాద్, డాక్టర్స్, ఇంజనీర్స్ జేఏసీల నుంచి డా.సురేష్ చంద్ర, శ్రీధర్ దేశ్‌పాండే, టి. వెంకటేశం, ఎమ్.బాలనర్సయ్య హాజరయ్యారు. టీచర్ల తరఫున ఎమ్. మణిపాల్ రెడ్డి, టీఎమ్ఆర్పీఎస్ నుంచి బొట్ల భిక్షపతి, తెలంగాణ వికాస సమితి నుంచి పిట్టల రవీందర్ తదితరులు ఉన్నారు.
