జీతాలు,పెన్షన్లు తగ్గించుకునేందుకే అగ్నిపథ్ స్కీం

జీతాలు,పెన్షన్లు తగ్గించుకునేందుకే అగ్నిపథ్ స్కీం

అగ్నిపథ్ స్కీంను వెంటనే రద్దుచేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జీతాలు, పెన్షన్లు తగ్గించుకునేందుకే అగ్నిపథ్ స్కీంను తీసుకొచ్చారని ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్  సంఘటన ప్రతి ఒక్కరిని కలవరపెట్టిందిని చెప్పారు. నిరసనకారులపై  పోలీసులు ఫైరింగ్ చేయడం సరైంది కాదన్న ఆయన..ఈ  సంఘటనలో కుట్ర ఉందనడం మూర్కత్వమన్నారు. జరిగిన పరిణామాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రాకేష్ కు  నివాళులు అర్పిస్తున్నామని..అతడి కుటుంబానికి తమవంతు సాయం అందిస్తామని తెలిపారు.నిన్నటి నిరసనలో ఆస్తుల నష్టాలు చూస్తున్నారు తప్ప, నిరుద్యోగ తీవ్రతను అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు.

ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియమకాలపై దృష్టి పెట్టాలని కోదండరాం సూచించారు. ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించకపోతే వారు చదివిన చదువు ఎందుకు పనికిరాకుండా పోతుందన్నారు. రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించడం మంచి పరిణామమే అన్న ఆయన..రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నారని వారికి కూడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. బాసర క్యాంపస్ ను పూర్తిగా పోలీసులతో బంధించారని..విద్యార్థుల తల్లిదండ్రులను కూడా లోపలికి అనుమతించకపోవడం దారుణమన్నారు. శాంతి భద్రతల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తోందని విమర్శించారు. ఇక నిరసనలో పాల్గొన్న విద్యార్థులను కేసుల పేరుతొ వేదించొద్దని..అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు.