కేసీఆర్​ను ప్రజలే డిస్మిస్ చేస్తరు

కేసీఆర్​ను ప్రజలే డిస్మిస్ చేస్తరు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి రాజకీయ పార్టీల ఉద్యమం తోడవ్వాలని, అప్పుడే ప్రభుత్వం దిగొస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన మద్దతు కోరడానికి లక్ష్మణ్ ను కలిశానని తెలిపారు. కార్మికుల ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సమస్యల కంటే రాజకీయం ముఖ్యం కాదని, అన్ని పార్టీలు ఆర్టీసీ జేఏసీ కింద ఉద్యమం చేయాలన్నారు. కార్మికుల ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని లక్ష్మణ్ హామీ ఇచ్చారని చెప్పారు. తాము చేస్తున్న ఉద్యమానికి జనం కూడా మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి కోరారు. టీజీవో, టీఎన్జీవోస్​ కూడా తమకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రంలో నలుగురు ఆర్టీసీ కార్మికులు చనిపోయారని రాజిరెడ్డి విమర్శించారు. కార్మికులెవరూ చనిపోవద్దని, తాము మద్దతుగా ఉంటామన్నారు.

హైదరాబాద్, వెలుగు:

‘‘సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఆయన 6 ఏళ్లు సెక్రటేరియట్​కు రాలేదు. మరి కేసీఆర్​ను ఎవరు డిస్మిస్ చేయాలి. త్వరలో ఆయన్ను ప్రజలు డిస్మిస్ చేస్తారు. దేవుడికి అంతా తెలుసు” అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగానికి లోబడి సమ్మె నోటీసు ఇస్తే.. చర్చలు జరపకుండా ‘సెల్ఫ్​డిస్మిస్’ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సమైక్య పాలనలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో కలిసి కె.లక్ష్మణ్​ను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోదండరాం కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మద్దతివ్వాలని లక్ష్మణ్​ను కోరారు. అరగంట పాటు వారు చర్చించారు. భేటీ తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఆత్మగౌరవ సమస్య

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వంపై రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. బీజేపీ వేదికగా పోరు సాగిస్తామని, టీఆర్ఎస్​ రాక్షస పాలనను అంతం చేసే సత్తా కేవలం తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం మాదిరే ఆర్టీసీ ఉద్యమంలోనూ రాజకీయాలతో సంబంధం లేకుండా పాల్గొంటామన్నారు. ప్రశ్నించే వారిని అణచేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. వారం రోజులుగా సమ్మె చేస్తున్నా కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని లక్ష్మణ్ విమర్శించారు. ఆర్టీసీ సమస్య కార్మికులది మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవ సమస్య అని అన్నారు. వరంగల్​లో 3.20 ఎకరాల ఆర్టీసీ భూమిని టీఆర్ఎస్​ నాయకులకు ఇచ్చారని, హైదరాబాద్​లోనూ వేల కోట్ల విలువ చేసే భూమిని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.

నేటి నుంచి డిపోల ముందు ధర్నాలు

ఆర్టీసీ కార్మికులకు అండగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా డిపోల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు లక్ష్మణ్​ తెలిపారు. మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 31 డిపోల ముందు శనివారం ధర్నా నిర్వహిస్తామన్నారు. మిగతా జిల్లాల్లోనూ విడతల వారీగా ధర్నాలు ఉంటాయన్నారు. బస్​భవన్ వద్ద జరిగే ధర్నాలో తాను పాల్గొంటానని తెలిపారు. సమ్మెపై మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి నోరు విప్పాలని బీజేపీ నేత ఎన్​వీఎస్ఎస్​ ప్రభాకర్​ డిమాండ్​ చేశారు. కేసీఆర్​ను ప్రశ్నించకపోతే వారు కూడా టీఆర్ఎస్ కిరాయిదారులే అవుతారన్నారు. కేసీఆర్ చేస్తున్న సమీక్షలు ఎవరి కోసమో అర్థం కావడం లేదన్నారు.