హుజూరాబాద్, వెలుగు: కేసీఆర్ హయాంలో కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారే తప్పా ప్రజల ప్రయోజనాల కోసం కాదని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో చర్చ జరగడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్ లో ఆదివారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా విద్యా సదస్సుకు వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు.
కోదండరాం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, డిజైన్ విషయంలో జాగ్రత్తలు పాటించలేదని ఆరోపించారు. ‘‘ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది. లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్, కాగ్ నివేదిక, ఘోష్ కమిటీ నివేదిక వచ్చాయి.
సీబీఐ మీదే వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’అని అన్నారు.తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతమవుతాయని కోదండరాం హెచ్చరించారు.
