కోల్‌కతా: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని, పాత ఓటర్ల జాబితాతో వెస్ట్ బెంగాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని మాజీ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఈసీ కలిసి ఓట్లను దోచుకున్నాయని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పేర్ల తొలగింపు తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తలపై మమతా బెనర్జీ ఫేస్ బుక్ లైవ్లో మాట్లాడారు. ‘బీజేపీ, ఈసీ కలిసి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దోచుకున్నాయని ఇప్పుడు స్పష్టమైంది. జ్ఞానేశ్ కుమార్ పదవిలో ఉన్నంత వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతాయి. ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఈ అంశంపై ఇండియా కూటమి పార్టీలతో త్వరలో సమావేశమై చర్చిస్తాం’ అని మమతా పేర్కొన్నారు.
