వెలుగు స్పెషల్ : మిస్ఇన్ఫర్మేషన్స్ తో పెరుగుతున్న ప్రమాదాలు

వెలుగు స్పెషల్ : మిస్ఇన్ఫర్మేషన్స్ తో పెరుగుతున్న ప్రమాదాలు

యుద్ధమా? ఆర్థిక సంక్షోభమా? ప్రకృతి విపత్తా? కాదు.. ప్రపంచాన్ని అత్యంత వేగంగా, అత్యంత సమీపంగా చుట్టుముడుతున్న ప్రమాదం  మీరు నమ్మే, మీరు ఫార్వర్డ్ చేసే సమాచారమే!  ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన 2026 గ్లోబల్ రిస్క్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ షాకింగ్ నిజం వెల్లడైంది.

 తప్పుడు సమాచారం (మిస్ఇన్ఫర్మేషన్), ఉద్దేశపూర్వక అసత్య ప్రచారం (డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇన్ఫర్మేషన్)  ప్రపంచవ్యాప్తంగా అత్యంత త్వరగా ప్రభావం చూపే ప్రమాదంగా నిలిచింది. 2024లో నిర్వహించిన తొలి సర్వేలోనూ ఇదే ప్రమాదం అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.  ఈసారి నివేదికలో అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం మరొకటి బయటపడింది. 

పెద్దఎత్తున యుద్ధం ముప్పు  ‘ఎప్పుడు సంభవించొచ్చు’ అనే ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది ఏకంగా 16 స్థానాలు పైకి దూసుకొచ్చింది. సర్వే చరిత్రలోనే  ఇదే అతిపెద్ద మార్పు. 36% మంది ప్రతినిధులు ఏడాదిలోపే భారీ యుద్ధం చెలరేగుతుందని, 76% మంది ఏడేళ్లలో అది తప్పదని అభిప్రాయపడ్డారు.

డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, నకిలీ వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. ఏఐతో పెరిగిన సవాలు

ఒక్క క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నకిలీ చిత్రాలు, కృత్రిమ స్వరాలు, మార్చిన వీడియోలు, డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సృష్టించడం ఇప్పుడు చాలా సులభం. ఏఐ, ఆధునిక సాంకేతికతలకు సంబంధించిన ప్రమాదాలు 2024తో పోలిస్తే గణనీయంగా పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది.

 అయితే వీటిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యవస్థల సన్నద్ధత మాత్రం అత్యంత తక్కువగా ఉంది. 28 ప్రమాదాల్లో సన్నద్ధత పరంగా ఏఐ 24వ స్థానంలో, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ 26వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. ఒక సమాచారం వైరల్ కావడం, వేలాది ఖాతాల్లో కనిపించడం అది నిజానికి రుజువు కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సందర్భంలో పుట్టింది, ధ్రువీకరణ ఉందా అన్నదే కీలకం.

ఉద్రిక్తతలకు కారణాలు నాలుగు

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను రేకెత్తించే నాలుగు ప్రధాన కారకాల్లో మిస్ఇన్ఫర్మేషన్ ఒకటిగా నివేదిక గుర్తించింది. మిగతా మూడు సహజ వనరుల కొరత, ఆర్థిక విభజన, బహుళపాక్షిక సంస్థల బలహీనత. సాంకేతిక ప్రమాదాలను సామాజిక పరిణామాలతో అనుసంధానించే కీలక వారధిగా మిస్ఇన్ఫర్మేషన్ పనిచేస్తున్నట్టు విశ్లేషణ వెల్లడించింది. 

గమనించాల్సిన విషయం ఏమిటంటే,  మొత్తంగా ‘అత్యంత ముఖ్యమైన’ ప్రమాదంగా వాతావరణ మార్పు  (క్లైమేట్ చేంజ్ ఇనాక్షన్) నిర్లక్ష్యమే నిలిచింది.  మిస్ఇన్ఫర్మేషన్ ‘అత్యంత త్వరగా సంభవించే’ ప్రమాదంగా నిలవడం విశేషం. ప్రమాద నివారణకు కేటాయించిన నిధులు సరిపోవడం లేదని 86% మంది ప్రతినిధులు అభిప్రాయపడటం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను, పోస్టును వెంటనే వార్తగా మార్చే ముందు మూలాన్ని పరిశీలించాల్సిన బాధ్యత జర్నలిజంపై  మరింత  పెరిగింది.

సందేశం వెనకాల విశ్వసనీయత ముఖ్యం

‘ఒక సందేశాన్ని చదవగానే ఫార్వర్డ్ చేయడం కాదు.. మూలాన్ని పరిశీలించడం, విశ్వసనీయ వనరులతో సరిపోల్చడం ఇప్పుడు ప్రతి పౌరుడి బాధ్యత’. 28 ప్రమాదాలపై అభిప్రాయాలు సేకరించినప్పుడు, ప్రభుత్వాల మధ్య సంయుక్త కృషినే అత్యంత ప్రభావవంతమైన మార్గంగా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 

దీన్ని దాదాపు 3,000 సార్లు ప్రస్తావించగా, వ్యక్తిగత చర్యను కేవలం 327 సార్లు మాత్రమే ప్రస్తావించడం గమనార్హం. సాంకేతిక ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సహకారం కూడా 
అనివార్యమని పేర్కొన్నారు.

 నివేదిక వెనుక కసరత్తు

2024 తర్వాత ఐక్యరాజ్యసమితి రెండోసారి నిర్వహించిన ఈ సర్వేను 2026 ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 24 వరకు నిర్వహించారు. 

ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, పౌర సమాజం, ఐరాస వ్యవస్థకు చెందిన 1,300 మందికిపైగా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ, సామాజిక రంగాలకు చెందిన 28 ప్రపంచ ప్రమాదాలను మదింపుచేశారు. యుద్ధం, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో పాటు.. ప్రజలు నమ్మే సమాచారం విశ్వసనీయంగా ఉండేలా చూసుకోవడం కూడా ఇప్పుడు ప్రపంచ భద్రతలో అంతే కీలకమైన అంశంగా మారింది. 

- అర్ధ శ్రీనివాస్ పటేల్ ,ఐఐఎస్​

 గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.