యూపీలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనం

యూపీలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 9 మంది సజీవ దహనం

లక్నో: ఉత్తరప్రదేశ్‎లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కదులుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి తొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు ఢిల్లీ నుంచి మహోబాకు వెళ్తుంది. 

ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్ర మత్తులో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. బస్సు మంటల్లో తగలబడి పోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

నోయిడా జాయింట్ సీపీ రాజీవ్ నారాయణ్ మిశ్రా ఈ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి మహోబాకు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారని ఆయన ధృవీకరించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40-50 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. 

బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని.. కొందరు కిటికీల నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. మంటలు వేగంగా బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణం ఏంటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదన్నారు. 

సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి తొమ్మది మంది సజీవ దహనమైన ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.