వెలుగు స్పెషల్ : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో రాజ్యాంగ స్పృహ పెరగాలి

వెలుగు స్పెషల్ : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో  రాజ్యాంగ స్పృహ పెరగాలి

జాతీయ స్థాయిలో  జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ  ఉద్యమ లక్ష్యాలను సాధించడంతో...  బీజేపీ, ఆర్ఎస్ఎస్  మానసికత కలిగిన ఆలోచనపరులు 'రిజర్వేషన్ హటావ్' అనే ఉద్యమాన్ని దేశం ముందుకు తీసుకువస్తున్నారు. ఈ ఉద్యమ లక్ష్యం మధ్యతరగతి వర్గాన్ని మళ్లీ  బీజేపీ వైపు మలుచుకునేదిగా  కనిపిస్తున్నది.  

దీంతోపాటు రాజ్యాంగ రచన కమిటీ  చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతిని తగ్గించేవిధంగా చర్చలు జరుపుతున్నారు. దీనికితోడు యూనివర్సిటీలలో  జరుగుతున్న అట్రాసిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కట్టడి చేసే క్రమంలో యూజీసీ  నిబంధనలలో  ఎస్సీ,  ఎస్టీలతోపాటు  ఓబీసీలను  చేర్చడం పాలక కులాలను కదిలించేసింది.  


మేమేనా మొత్తం సామాజిక వివక్షకు కారకులం అని ప్రశ్నిస్తున్నారు?  దీంతో  అధికార కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు చేయడం, దాంతో  సుప్రీంకోర్టులో యూజీసీ నిబంధనలపైన స్టే విధించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే... 2024 జనరల్ ఎలక్షన్లలో 400 ఎంపీలను  గెలిపించండి రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ నినాదానికి కొనసాగింపుగా  పౌర సమాజంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై దాడులు జరుగుతున్నట్టుగా ఉన్నది.

సామాజిక, రాజకీయ న్యాయాన్ని పాటించాలి

డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతలో  వెలువడిన రాజ్యాంగం అధికార కులాలను ఇంత  కలవరపెడుతున్నది అంటే దాంట్లో ఉన్న మర్మమేంటో చూడాల్సి ఉంది.  ముఖ్యంగా  అల్పసంఖ్యలో ఉన్న ఎదిగిన కులాల నాయకత్వం 90% కంటే ఎక్కువగా  ప్రభుత్వ వ్యవస్థలలో  ఉన్నారు. దాని ద్వారా 80 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమలు, ప్రసార సాధనాలు కూడా వారి పూర్తి కబ్జాలోకి వెళ్లిపోయాయి. 

అరకొరగా  అక్కడో  ఇక్కడో కనిపిస్తున్న ఎస్సీ, ఎస్టీ,  ఓబీసీలపై  ఇంత  అసహనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు.  వారు కూడా ఈ దేశ పౌరులే.  వారికి  సమాన అవకాశాలను కల్పించాలని  రాజ్యాంగం  సూచిస్తుంది.  దాంతోపాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పాటించాలని  కూడా  రాజ్యాంగ పీఠికలో  చేర్చడమైనది.  అదేవిధంగా  జాతి నిర్మాణంలో  సోదర భావంతో  నడవాలని కూడా చెప్తున్నది.  

కానీ అలాంటి  యూనివర్సల్  విలువలను పాటించడానికి ఉన్నతమైన స్థానాన్ని పొందిన సమాజాలు ఎందుకు అసహనాన్ని వ్యక్తపరుస్తున్నాయి.  ఇది అమానవీయ మనస్తత్వం కాదా?  90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగదొక్కుతూ వస్తుంటే వారికి మిగిలింది అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఒకటే. 

ఉద్యమాల లక్ష్యం సమానత్వం

బహుజనులు రాజ్యాంగాన్ని పూర్తిగా ఒంట పట్టించుకోవటం లేదు.  సామాజిక బానిస స్పృహలోనే  ఎక్కువ మంది కొట్టుకుపోతున్నారు. స్వేచ్ఛ సాధనకు అంబేద్కర్  అందించిన రాజ్యాంగ వాదాన్ని చూడలేకపోతున్నారనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగ ఆర్టికల్ 14లో బుద్ధుడి నుంచి బసవన్న,  భక్తి ఉద్యమకారులు, ఫూలే,  అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వరకూ సాగిన ఉద్యమాల లక్ష్యమైన 'సమానత్వాన్ని' చేర్చడమైంది.  

సమానత్వ సాధనలో భాగంగానే ఆర్టికల్ 15,  ఆర్టికల్ 16  చేర్చడమైంది. అయితే,  భారత సమాజం నిచ్చెన మెట్లతో  కూడినది.  అసమాన కుల వ్యవస్థను  సమానత్వం వైపు నడిపించేందుకు  అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరి కొందరు జాతీయ నాయకులు ఆలోచించారు.  

సమానత్వ స్పృహతో కూడిన  భారతజాతి  నిర్మాణం  జరుగుతుందని  భావించారు.  అయినప్పటికీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న ఆర్ఎస్ఎస్ మానసికతతో కూడిన వ్యక్తులు, శక్తులు, పార్టీలు రకరకాల రూపాలలో వ్యతిరేకతను  ప్రదర్శిస్తూ వస్తున్నారు.  

సామాజిక న్యాయ సాధనకు ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్ లేదా రిప్రజెంటేషన్ ఇవ్వాలనే లక్ష్యంకోసం వేళల్లో ఉన్న కులాలను  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనే మూడు వర్గాలుగా చేర్చడం ఒక విప్లవాత్మక అడుగుగా గమనించాలి.  

జాతి ఐక్యత, సామాజిక అధికారం

రాజ్యాంగ సభలో ఒక వర్గం ఎస్సీ,  ఎస్టీలను  చేర్చడం వ్యతిరేకించినా అంబేద్కర్  నిరసనతో అంగీకరించడం జరిగింది.  అదేవిధంగా ఓబీసీలను ఆర్టికల్ 16లో  చేర్చడాన్ని పెద్ద ఎత్తున ఎదిగిన కుల నాయకత్వాలు వ్యతిరేకించాయి. చివరకు రాజ్యాంగ సభ ఆమోదించింది. 

 ఓబీసీల గుర్తింపుతోపాటు వారి ఉన్నతికి సూచనలు చేసేందుకు ఆర్టికల్ 340ని  కూడా  చేర్చడమైంది.  దాంతో ఎదిగిన కుల సమాజాలు ఈరోజు వరకు ఓబీసీలను రాజ్యాంగంలో చేర్చడాన్ని  వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  వేలల్లో ఉన్న వెనుకబడిన కులాలు ఒకే  ఓబీసీ వర్గంగా మారడం పాలక కులాల నాయకత్వానికి వణుకు పుట్టించింది.  

ఎందుకంటే  ఈ  దేశంలో ఉన్న సామాజిక అణచివేతలకు వారిలో ఉన్న  ఆధిపత్య  కుల స్వభావమే కారణమని తేలుతుంది.  అలాంటి స్పృహకు  నాయకత్వం వహిస్తోంది బీజేపీ,  ఆర్ఎస్ఎస్ వారే.  వేల కులాలను (బీజేపీ/ ఎన్డీఏ ప్రభుత్వ దృష్టిలో లక్షల కులాలు) ఎస్సీ,  ఎస్టీ,  ఓబీసీలుగా ఐక్యతను పెంపొందించే  రాజ్యాంగాన్ని మార్చడమే సరైనదని వివిధ రూపాలలో ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ 
ప్రదర్శిస్తోంది.  

భారత సామాజిక వ్యవస్థలో వందల, వేల కులాలుగా విడిపోయి ఉన్నవారిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలనే మూడు వర్గాలుగాకాక రాజ్యాంగ పరంగా ఒకే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ (బీసీలు)గా  ఐక్య పరుస్తుంది.  దీంట్లో ఉన్న జాతి ఐక్యత,  సామాజిక గౌరవం,  సామాజిక అధికారాన్ని ఎదిగిన వర్గాలు  డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి.

 రాజ్యాంగ స్పృహతోనే  చైతన్యం

వేలల్లో ఉన్న కులాలు.. వారి సంఘాలు,  నాయకులు మనమంతా ఒకటేనని,  బీసీలమని  గుర్తించలేకపోతున్నారు. అందువలననే  పీడితులుగా, దళితులుగా, అసమానితులుగా మిగులుతున్నామని ఎస్సీ, ఎస్టీ, బీసీలు గ్రహించడం లేదు. విద్యావంతులమైన మనమందరం  వివిధం కులాలలో పుట్టినా  కాలక్రమేణా  వివిధ  ప్రభావాలకులోనై ఎస్సీలుగా,  ఎస్టీలుగా,   ఓబీసీలుగా గుర్తింపు పొందాం.  

కులాలుగా విభజించిన ముక్కలం కాదు.  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలుగా  ఎదిగిన వ్యక్తులం. సామాజిక శక్తులుగా భావిస్తున్నాం.   కులాలుగా ఉన్నవారిని పార్టీల రూపంలో ఐక్యం చేసినప్పుడు అవే కులాలు రాజ్యాంగ బ్యాక్​వర్డ్  క్లాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదగడం సాధ్యం కాదా?  రాజ్యాంగ స్పృహతోనే  దేశ ప్రజలంతా  ఒక్కటే అనే  చైతన్యాన్ని పొందగలుగుతాం.  

విభజన స్పృహతో  కూడిన  మనువాద మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధిగమించగలం. డాక్టర్ అంబేద్కర్  భారత సమాజాన్ని శోధించి, ఉద్యమించి రాజ్యాంగ జాతి నిర్మాణం కోసం అందించిన బీసీల ఐక్యత ఆయుధాన్ని  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అవగతం చేసుకోవాలి.  అప్పుడే వారు అధికార సమాజంగా,  అభివృద్ధి సమాజంగా, ఆలోచన సమాజంగా ముందుకుపోతారు. 

–ప్రొఫెసర్​ ఎస్​. సింహాద్రి యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ, తెలంగాణ అధ్యక్షుడు

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.