
హైదరాబాద్, వెలుగు: మైనార్టీ హాస్టళ్లలోని విద్యార్థులకు సమగ్ర ఆరోగ్యం, పరిశుభ్రత అందించడమే తమ లక్ష్యమని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్) కార్యదర్శి బీ షఫియుల్లా అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నాంపల్లిలోని సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య పర్యవేక్షణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం షఫియుల్లా మాట్లాడుతూ..విద్యార్థుల ఆరోగ్య, పరిశుభ్రత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపటమే తమ లక్ష్యమన్నారు.
విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం, ఆహార భద్రత, అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. 205 పాఠశాలలకు నిరంతర అనుసంధానంతో ఆరోగ్య పర్యవేక్షణ మొబైల్ యాప్ అందుబాటులో ఉంటుందన్నారు. దీని ద్వారా విద్యార్థుల ఆరోగ్య సమాచారం నేరుగా తమ కార్యాలయానికి చేరుతుందని తెలిపారు. ఆహార నిపుణులు పాఠశాలల్లో పర్యవేక్షణ నిర్వహిస్తారని వెల్లడించారు. కిచెన్ సిబ్బంది, వార్డెన్లకు ఆహార భద్రతపై శిక్షణ ఇస్తామన్నారు.