సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తం : టీఎంయూ

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తం : టీఎంయూ
  • ఆర్టీసీ మేనేజ్​మెంట్​కు టీఎంయూ హెచ్చరిక
  • 15 రోజులు టైమ్ ఇస్తున్నం
  • పీఆర్సీలు, యూనియన్లు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలే ప్రధాన డిమాండ్లు

హైదరాబాద్, వెలుగు: కార్మికుల సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎంయూ (థామస్ రెడ్డి వర్గం, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న యూనియన్) హెచ్చరించింది. పీఆర్సీలు ఇవ్వడంతో పాటు యూనియన్ల పునరుద్ధరణ, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తమ ప్రధాన డిమాండ్లుగా థామస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం బస్ భవన్​లో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై టీఎంయూ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. థామస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 9న జరిగిన టీఎంయూ రాష్ట్ర కమిటీ సమావేశంలో సమస్యలపై పోరాటాలు చేయాలని పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. 

2 పీఆర్సీలు, సీసీఎస్ లోన్లు రాకపోవటంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూనియన్లు లేకపోవటంతో కార్మికులను అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. పని గంటలు పెరిగాయని, ఉద్యోగ భద్రత లేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సెటిల్ మెంట్లు చేయటం లేదన్నారు. ఇటీవల మంత్రి హరీశ్ రావును కలిసి సమస్యలను చెప్పామని, పీఆర్సీ, యూనియన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని థామస్ రెడ్డి వెల్లడించారు.

పోరాటాలు ఉధృతం చేస్తున్నం: రాజిరెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక టైమ్​లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. మంగళవారం వీఎస్టీలోని యూనియన్ ఆఫీస్ లో రీజనల్ కమిటీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలపై బుధవారం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని, 16న ట్రేడ్ యూనియన్లతో మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.