వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

రాత్రికిరాత్రే వెలసిన పోచమ్మ విగ్రహం
పసుపు కుంకుమలతో భక్తుల పూజలు

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ జిల్లా నడిబొడ్డున ఉన్న ఓసిటీ మైదానంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి పోచమ్మ తల్లి విగ్రహాన్నినిలబెట్టారు. ఈ సమాచారంతో భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. భక్తులు టెంట్‍ ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకొని టెంట్‍ను కూల్చివేశారు. భక్తులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోచమ్మతల్లి విగ్రహం గ్రౌండ్‍ లోపలకు ఎలా వచ్చిందనే అంశమై విచారణ చేస్తున్నామని మిల్స్‍ కాలనీ పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పీర్ల పండుగ సందర్భంగా ఇదే మైదానంలో కొందరు వ్యక్తులు ఓ గది ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని, దానికి నిరసనగా పోచమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టి ఉంటారనే ప్రచారం సాగుతోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్థలాన్ని ఇండోర్ స్టేడియంగా చేయాలని భావించింది. 

పరకాల బంద్ ప్రశాంతం


పరకాల, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురు ప్రసాద్ పై టీఆర్ఎస్ లీడర్ల దాడిని నిరసిస్తూ బుధవారం నిర్వహించిన పరకాల బంద్​ప్రశాంతంగా ముగిసింది. విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. బీజేపీ ఇచ్చిన బంద్​కు స్వచ్ఛందంగా సహకరించారు. బంద్ తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్​చార్జి పెసర విజయచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ లీడర్లు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జయంతిలాల్, భద్రయ్య, పూర్ణ చారి తదితరులున్నారు.

కదంతొక్కిన వీఆర్ఏలు

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: వీఆర్ఏల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం స్టేషన్​ఘన్​పూర్​లో దాదాపు 200 మంది వీఆర్ఏలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్​ నుంచి గాంధీ చౌరస్తా, పోలీస్​స్టేషన్​మీదుగా ఆర్డీవో ఆఫీస్​ వరకు ర్యాలీ సాగింది. ప్రభుత్వం వీఆర్ఏలకు  పేస్కేల్ అమలుతో పాటు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆగని రేషన్ బియ్యం దందా

కాజీపేట, వెలుగు: రేషన్​ బియ్యం దందా ఆగడం లేదు. బుధవారం టాస్క్​ఫోర్స్ సీఐలు వి.నరేశ్​ కుమార్, ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేర్వేరు చోట్ల దాడులు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం 64 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎల్బీనగర్ కు చెందిన జోగు రఘువీర్ రేషన్ బియ్యాన్ని సేకరించి, పౌల్ట్రీ ఫామ్​కు తరలిస్తున్నాడు. ఈక్రమంలో రైడ్ చేసి, రఘువీర్​ను పట్టుకున్నారు. ఆయన నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన శెర్ల తిరుపతి ఇక్కడి రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. ఇలా హసన్​ పర్తి, ఎల్కతుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి సేకరించిన బియ్యాన్ని కోమటిపల్లి శివారులో డంప్​ చేసి.. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా పెట్టాడు. ఈ క్రమంలో టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందగా.. రైడ్​ చేసి తిరుపతితో పాటు  రూ.1.04లక్షల విలువైన 40 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. తరువాత దర్యాప్తు కోసం నిందితుడిని కేయూ పోలీసులకు అప్పగించారు. కాజీపేట బుడగజంగాల కాలనీకి చెందిన తూర్పాటి రాజు రేషన్ బియ్యం తరలించే ప్రయత్నం చేయగా.. పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 18 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గులాబీ లీడర్ల మధ్య లీజ్​ లొల్లి
డీసీసీబీ కాంప్లెక్స్​ తనకు లీజ్‍ కు ఇచ్చారంటున్న డైరెక్టర్‍ శ్రీనివాస్‍రెడ్డి.. ఇచ్చే ప్రసక్తి లేదంటున్న చైర్మన్‍ రవీందర్‍రావు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ డీసీసీబీ ఆవరణలోని కమర్షియల్‍ కాంప్లెక్స్ లీజ్‍ వ్యవహారం.. ఆ పాలకవర్గంలోని ఇద్దరు టీఆర్‍ఎస్‍ నేతల మధ్య చిచ్చుపెట్టింది. లీజు రద్దు చేసుకోవాలని ఒకరు.. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేసేదిలేదని మరొకరు పట్టుబట్టడంతో ఈ లొల్లి మరింత ముదిరింది. బ్యాంక్‍ చైర్మన్‍ మార్నేని రవీందర్‍రావు, మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు. కాగా, లీజు దారుడైన బ్యాంక్ డైరెక్టర్‍ కంది శ్రీనివాస్‍రెడ్డి.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుడు.

జంగా రాఘవరెడ్డి హయంలో లీజ్..

డీసీసీబీ కాంప్లెక్స్ ముందు భాగంలో ఉన్న బిల్డింగ్​ను కిరాయికి ఇచ్చి, బ్యాంక్ ఆదాయం పెంచుకోవాలని 2014లో అప్పటి డీసీసీబీ చైర్మన్‍ జంగా రాఘవరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2017లో కంది శ్రీనివాస్ రెడ్డి(ప్రస్తుత డీసీసీబీ డైరెక్టర్)కి చెందిన జేబీఎన్‍ సంస్థ లీజుకు తీసుకుంది. రూ.3 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టగా.. ఆ సంస్థ రూ.1.40 కోట్లు డిపాజిట్‍ చేసింది. డీసీసీబీ ఆఫీసర్లు బిల్డింగ్‍ పనులు పూర్తి చేసేలా నల్లవెల్లి కన్‍స్ట్రక్షన్‍కు అప్పగించారు. అంతలోనే డీసీసీబీ పాలకవర్గం, ఆఫీసర్ల పనితీరుపై అవినీతి, ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు సస్పెండ్‍ అయ్యారు. మొత్తంగా లీజ్‍ దక్కించుకున్న సంస్థ.. మిగతా రూ.1.60 కోట్లు బ్యాంకుకు చెల్లించలేదు. మరోవైపు నల్లవెల్లి సంస్థ దాదాపు పనులు పూర్తి చేసినా ప్రస్తుత పాలకవర్గానికి ఆ బిల్డింగును అప్పగించలేదు. ఈ క్రమంలో గతేడాది బ్యాంక్‍ ఆస్తులను లీజ్​కు ఇవ్వొద్దని గైడ్ లైన్స్ జారీ చేసింది. దీంతో నాడు లీజ్‍ పొందిన కంది శ్రీనివాస్‍రెడ్డి కోర్టుకు వెళ్లారు. అది తీర్పు దశలో ఉంది. ఇంతలోనే సరికొత్త వివాదం తెరమీదకొచ్చింది.

సై అంటే సై..

కంది శ్రీనివాస్​రెడ్డికి చెందిన సంస్థ లీజ్‍ తీసుకున్న టైంలో ఆర్బీఐ నుంచి ఎలాంటి గైడ్‍లైన్స్ లేవు. ప్రస్తుతం శ్రీనివాస్‍రెడ్డి ప్రముఖ షాపింగ్‍ మాల్‍ కు బిల్డింగ్‍ను సబ్‍ లీజ్‍కు ఇచ్చేందుకు వీలుగా పనులు చేస్తున్నారు. దీన్ని డీసీసీబీ చైర్మన్‍ మార్నేని రవీందర్‍రావు అడ్డుకుంటున్నారు. నాడు నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి లీజ్‍లు ఇచ్చినందుకే పాలకవర్గం, ఆఫీసర్లపై సస్పెన్షన్‍ విధించారని..దీనికితోడు కొత్త గైడ్‍లైన్స్ ప్రకారం బ్యాంక్‍ ఆస్తులను లీజ్​కు ఇస్తే బ్యాంక్‍ లైసెన్స్ రద్దు అవుతుందని పేర్కొన్నారు. ఎవరికీ లీజ్‍ ఇవ్వమంటూ పాలకవర్గంతో మంగళవారం తీర్మానం కూడా చేయించారు. షాపింగ్‍ కాంప్లెక్స్ పనులు నిర్వహిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సుబేదారి పోలీస్‍ స్టేషన్​లో ఆఫీసర్లతో ఫిర్యాదు చేయించారు. కాగా, తాను గైడ్‍లైన్స్ రావడానికి ముందే లీజ్‍ పర్మిషన్‍ పొందానని.. కొత్త నిబంధనలు తనకు వర్తించవని శ్రీనివాస్‍రెడ్డి వాదిస్తున్నారు. పనులు చేసుకునేందుకు తనకు కోర్ట్ పర్మిషన్‍ ఇచ్చిందని చెబుతున్నారు. ఇరువురిని  మంత్రి దయాకర్‍రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంప్రమైజ్‍ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‍రెడ్డి తన లీజ్‍, కోర్ట్ కేసులు వాపస్‍ తీసుకుంటే.. గతంలో ఇచ్చిన డబ్బులకుతోడు పరిహారం ఇప్పించేలా  సంప్రదింపులు నడుస్తున్నట్లు తెలిసింది.

జనగామలో వ్యక్తి దారుణ హత్య

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలోని అంబేద్కర్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పగడాల సందీప్, పకీర్ సురేశ్(34) ఇద్దరు మిత్రులు. సందీప్ భార్య, సురేశ్ వాళ్ల అన్నయ్య రమేశ్.. ఒకే స్కూల్​లో టీచర్లుగా పనిచేస్తున్నారు. గతంలో రమేశ్, సందీప్ భార్యకు అసభ్యకర మెసేజ్ పంపాడు. దీంతో సందీప్​ఆగ్రహం వ్యక్తం చేసి, రమేశ్ ను బెదిరించాడు. దీంతో రమేశ్, సందీప్ కాళ్లు మొక్కి క్షమాపణ కోరాడు. ఇటీవల ఈ విషయం తమ్ముడు సురేశ్ కు తెలియడంతో సందీప్​పై పగ పెంచుకున్నాడు. తన అన్నయ్యకు, సందీప్ భార్యకు అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేశాడు. దీంతో సందీప్, సురేశ్ కు మధ్య గొడవలు జరిగాయి. మంగళవారం రాత్రి అంబేద్కర్ నగర్ కు చెందిన తాండ్ర విజయ్ తో కలిసి సురేశ్​మద్యం తాగాడు. గొడవ సెటిల్ చేసుకుందామని విజయ్, సందీప్​ను పిలిచాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. సందీప్, సురేశ్​ మధ్య మాటామాటా పెరిగింది. సందీప్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సురేశ్​ను పొడిచాడు. దీంతో స్పాట్​లో సురేశ్​చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ క్రిష్ణ, సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని, డెడ్ బాడీని జిల్లా ఆసుపత్రికి తరలించారు.నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

తీజ్ వేడుకల్లో ఎంపీ

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలకేంద్రంలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఆడిపాడారు. అనంతరం పాకాల వాగులో తీజ్ బుట్టలను నిమజ్జనం చేశారు. ప్రభుత్వం సాంప్రదాయ పండుగలకు పెద్దపీట వేస్తోందని, ప్రత్యేక నిధులు కేటాయించి, పండుగలను గ్రాండ్​గా నిర్వహిస్తోందని ఎంపీ అన్నారు.– గూడూరు, వెలుగు


రెండ్రోజుల్లో అశోక స్తూపం  రెడీ చేయాలి

కార్పొరేషన్, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ ఆవరణలో నిర్మిస్తున్న అశోక స్తూపం నిర్మాణ పనులు ఈ నెల 20లోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం ఆమె సంబంధిత పనులను పరిశీలించారు. స్తూపం ఏరియా మరింత సుందరంగా కనిపించేలా పలు సూచనలు చేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల గుర్తింపు, జ్ఞాపకంగా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో బల్దియా సీహెచ్ఓ శ్రీనివాసరావు, డీఈలు రవికుమార్, సంజయ్ పాల్గొన్నారు.

తనిఖీ చేయడానికి మీరెవరు?
ప్రజాప్రతినిధులపై ప్రిన్సిపల్, టీచర్ల నోటి దురుసు

​పర్వతగిరి, వెలుగు: సోషల్ వెల్ఫేర్ హాస్టల్​ను తనిఖీ చేయడానికి మీరెవరంటూ ప్రిన్సిపల్ తో పాటు టీచర్లు నోరు పారేసుకున్నారు. ఈఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్​ లో జరిగింది. బుధవారం ఎంపీపీ కమల, జడ్పీటీసీ, స్టాండింగ్ కమిటీ చైర్మన్ సింగూలాల్, ఎంపీటీసీలు రాజు, మహేంద్ర, సర్పంచులు మాలతి, రేణుక హాస్టల్​ను తనిఖీ చేయడానికి వెళ్లారు. కిచెన్ లో వంటలను రుచి చూసి, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రిన్సిపల్ సమ్మయ్య, టీచర్లు వీణ, పవన్ అక్కడకు చేరుకుని, ఏ అధికారంతో లోపలికి వచ్చారని ప్రశ్నించారు. తాను స్టాండింగ్ కమిటీ చైర్మన్ అని సింగూలాల్ చెప్పగా.. చైర్మన్​ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, సీఎం అయినా ఎవరూ ఏమీ చేయలేరని ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

పాదయాత్ర పేరుతో బండి సంజయ్ డ్రామాలు

హసన్ పర్తి, హనుమకొండ కలెక్టరేట్, స్టేషన్ ఘన్ పూర్, ఎంజీఎం, వెలుగు: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతూ.. మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి, జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ ఎంజీఎం, హనుమకొండ కలెక్టరేట్​లలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని ఆగం జేస్తోందన్నారు. తమ ప్రభుత్వంపై కొన్ని పార్టీలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు, లీడర్లు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు రాజయ్య, అరూరి రమేశ్, జడ్పీ చైర్మన్లు పాగాల సంపత్​రెడ్డి, సుధీర్ బాబు, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, శివలింగయ్య, గోపి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, ఎంజీఎం సూపరింటెండెంట్ డా.చంద్రశేఖర్ ఉన్నారు.


ముగిసిన ఎగ్జిబిషన్​


వరంగల్ సిటీ, వెలుగు: ఆజాదీకా అమృత్​ మహోత్సవంలో భాగంగా వరంగల్ ఖుష్ మహల్ లో నిర్వహించిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్​బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వరంగల్ కేంద్రీయ విద్యాలయానికి చెందిన స్టూడెంట్లు దేశ భక్తి అంశాలపై డాన్సులు చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు.