చెన్నై, రాజస్తాన్‌కు కఠిన పరీక్ష

చెన్నై, రాజస్తాన్‌కు కఠిన పరీక్ష

షార్జా / దుబాయ్‌‌: ప్లే ఆఫ్‌‌ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌, రాజస్తాన్‌‌ రాయల్స్‌‌.. ఐపీఎల్‌‌లో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. నేడు జరిగే రెండు మ్యాచ్‌‌ల్లో చెన్నై.. ఢిల్లీతో, రాజస్తాన్‌‌.. బెంగళూరుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమీకరణాల ప్రకారం చూస్తే టేబుల్‌‌లో చెన్నై, రాజస్తాన్‌‌ చెరో ఆరు పాయింట్లతో వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌‌ల్లో గెలవడం ఈ రెండు టీమ్‌‌లకు అత్యవసరం. టేబుల్‌‌ టాపర్‌‌గా ఉన్న ఢిల్లీ (10)ని ఈ మ్యాచ్‌‌లో చెన్నై ఎంతమేరకు అడ్డుకుంటుందో చూడాలి. అయితే హైదరాబాద్‌‌పై అన్ని స్ట్రాటజీలు సమర్థంగా పని చేయడంతో ఈ మ్యాచ్‌‌లోనూ వాటిని కొనసాగించాలని కెప్టెన్‌‌ ధోనీ భావిస్తున్నాడు. సామ్‌‌ కరన్‌‌ను మరోసారి ఓపెనర్‌‌గా పంపించే చాన్స్‌‌ ఉంది. రన్స్‌‌ కట్టడి చేసేందుకు ఏడు బౌలర్ల స్ట్రాటజీకి మరింత మెరుగులు పెట్టనున్నాడు. మరోవైపు ఢిల్లీకి బ్యాటింగ్‌‌ బౌలింగ్‌‌లో పెద్దగా సమస్యల్లేవు. రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఫిట్‌‌నెస్‌‌పై ఆందోళన కొనసాగుతున్నా… ధవన్‌‌, పృథ్వీ, స్టోయినిస్‌‌ కుదురుకుంటే భారీ స్కోరు ఖాయం.

గెలుపుపై గురి..

మరో మ్యాచ్‌‌లో బెంగళూరు విజయంపై గురిపెట్టింది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో కోహ్లీ స్ట్రాటజీ పెద్దగా వర్కౌట్‌‌ కాలేదు. డివిలియర్స్‌‌ను మరీ లోయర్‌‌ ఆర్డర్‌‌లో తీసుకురావడం ఇబ్బందిగా మారింది. సుందర్‌‌, దూబేకు ప్రమోషన్‌‌ ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయారు. ఫించ్‌‌, పడిక్కల్‌‌ మరోసారి చెలరేగాలి. ఇక రాజస్తాన్‌‌ విషయానికొస్తే ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్​ వచ్చినా రాత మాత్రం మారలేదు. కెప్టెన్‌‌ స్మిత్‌‌, శాంసన్‌‌, బట్లర్‌‌ వైఫల్యం టీమ్‌‌పై ప్రభావం చూపుతోంది. తెవాటియా మరోసారి చెలరేగాలి.