లెక్క సరిచేస్తారా?: నేడు న్యూజిలాండ్‌‌తో రెండో వన్డే

లెక్క సరిచేస్తారా?: నేడు న్యూజిలాండ్‌‌తో రెండో వన్డే

కొంతకాలంగా టీ20 సిరీస్‌‌లను క్లీన్‌‌స్వీప్‌‌ చేస్తున్న టీమిండియా.. ఆ వెంటనే జరిగే తొలి వన్డేలో ఓడటం.. మళ్లీ పుంజుకోవడం.. సిరీస్‌‌ను గెలవడం.. ఓ ఆనవాయితీగా వస్తోంది..! వెస్టిండీస్‌‌, ఆస్ట్రేలియాపై ఇలాగే జరిగింది..! ఇప్పుడు న్యూజిలాండ్‌‌లోనూ తొలి వన్డేలో ఓడిన విరాట్‌‌సేన.. అదే ఆనవాయితీని కొనసాగిస్తుందా..? బలహీనంగా మారిన బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌ను మెరుగుపర్చుకుని లెక్క సరి చేస్తుందా..? లేక అప్పన్నంగా సిరీస్‌‌ను హోమ్‌‌ టీమ్‌‌కు అప్పగిస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో.. నేడు జరిగే రెండో వన్డేలో ఇండియా.. న్యూజిలాండ్‌‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది..!!

ఆక్లాండ్‌‌: తొలి వన్డే పరాజయంతో నేలకు దిగిన ఇండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సిరీస్‌‌ సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌‌ కోసం రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే రెండో వన్డేలో జోరుమీదున్న న్యూజిలాండ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 0–1తో వెనుకబడ్డ టీమిండియా.. ఈ మ్యాచ్‌‌లో ఎలాగైనా గెలిచి లెక్క సరి చేయాలన్న పట్టుదలతో ఉంది.
మూడొందలకు పైగా స్కోరు చేసినా పేలవ బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌తో తొలి వన్డేను కాపాడుకోలేకపోవడంతో ప్రస్తుతం విరాట్‌‌సేనపై ఒత్తిడి నెలకొంది. అయితే ఇటీవల ఇండియా పెర్ఫామెన్స్‌‌ను చూస్తే.. గత రెండు వన్డే సిరీస్‌‌ల్లో తొలి మ్యాచ్‌‌లో ఓడినా సిరీస్‌‌లు గెలవడం విశేషం. స్వదేశంలో వెస్టిండీస్‌‌తో చెన్నైలో ఓడినా.. తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌‌ల్లో నెగ్గింది. ఆసీస్‌‌తో జరిగిన సిరీస్‌‌లో తొలి వన్డే (ముంబై)లో షాక్‌‌ తగిలినా.. తర్వాతి రెండు మ్యాచ్‌‌ల్లో నెగ్గి సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు హామిల్టన్‌‌లో ఓడిన టీమిండియా అదే సీన్‌‌ రిపీట్‌‌ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. మరోవైపు తొలి వన్డే ఓడిన తర్వాత న్యూజిలాండ్‌‌ గడ్డపై ఇండియా పుంజుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడే సిరీస్‌‌ ముగించాలని కివీస్‌‌ లెక్కలేసుకుంటున్నది.

సైనీ, ఠాకూర్‌‌లో ఎవరు?

బ్యాటింగ్‌‌ పిచ్‌‌ కావడం, సెకండ్‌‌ బ్యాటింగ్‌‌కు అడ్వాంటేజ్‌‌ ఉండటంతో తుది జట్టులో మార్పులు చేయాలని కోహ్లీ భావిస్తోన్నాడు. లోయర్‌‌ ఆర్డర్‌‌ బ్యాటింగ్‌‌లో డెప్త్‌‌ తీసుకురావడంతో పాటు బౌలింగ్‌‌ కూర్పునూ మార్చే చాన్స్‌‌ ఉంది. శుక్రవారం నెట్‌‌ ప్రాక్టీస్‌‌ చూస్తే ఇది అర్థమవుతుంది. సైనీ, ఠాకూర్‌‌ బౌలింగ్‌‌తో పాటు బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశారు. అయితే తొలి వన్డేలో ధారాళంగా రన్స్‌‌ ఇచ్చిన ఠాకూర్‌‌ స్థానంలో సైనీకి అవకాశం ఇవ్వాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. స్పిన్‌‌లో చహల్‌‌ను తీసుకొచ్చి కుల్దీప్‌‌ను బెంచ్‌‌కు పరిమితం చేస్తారా చూడాలి. పేసర్లలో బుమ్రా, షమీ విఫలమైనా.. వీళ్లను మార్చే చాన్స్‌‌ లేదు. అయితే వీలైనంత త్వరగా వీళ్లు గాడిలో పడటం ఇండియాకు అత్యవసరం. బ్యాటింగ్‌‌లో కేదార్‌‌ జాదవ్‌‌ రోల్‌‌ దేనికి అవసరం పడటం లేదు. పార్ట్‌‌ టైమ్‌‌ స్పిన్నర్‌‌గా టీమ్‌‌లో బ్యాలెన్స్‌‌ తెస్తాడని అనుకున్నా.. తొలి వన్డేలో ఒక్క ఓవర్‌‌ కూడా వేయలేదు. షార్ట్‌‌ బౌండరీల కారణంగా ఇవ్వలేదనుకున్నా.. ఈ మ్యాచ్‌‌లోనూ అదే పరిస్థితి. కాబట్టి అతన్ని తప్పించి ఆల్‌‌రౌండర్‌‌ శివమ్‌‌ దూబే, లేక స్పెష్టలిస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ మనీష్‌‌ పాండేను తీసుకోవాలని చూస్తున్నారు. మిగతా లైనప్‌‌లో మయాంక్‌‌, పృథ్వీ మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే, రాహుల్‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌‌ ఆశించొచ్చు. చెన్నై, ముంబై, హామిల్టన్‌‌లో ఓటమికి ప్రధాన కారమైన ఫీల్డింగ్‌‌లో ఇండియా మరింత మెరుగవ్వాల్సి ఉంది.

అందరూ ఫామ్‌‌లో..

మరోవైపు కివీస్‌‌ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సెడాన్‌‌ పార్క్‌‌లో అత్యధిక స్కోరును ఛేదించడంతో ఫుల్‌‌ కాన్ఫిడెన్స్‌‌ను సంపాదించుకుంది. టీ20 సిరీస్‌‌ వైట్‌‌వాష్‌‌తో వచ్చిన అప్రతిష్టను ఒకే మ్యాచ్‌‌తో పోగొట్టుకుంది. కాబట్టి ఈ మ్యాచ్‌‌లో కచ్చితంగా కివీసే ఫేవరెట్‌‌. మిడిలార్డర్‌‌లో లాథమ్‌‌ బ్యాటింగ్‌‌ ఫలితాన్ని శాసించడం అనుకూలాంశం. ఇదే విషయాన్ని కోహ్లీ కూడా చెప్పాడు. సో మిడిల్‌‌ ఓవర్లలో టీమిండియా బౌలర్లు లాథమ్‌‌ లక్ష్యంగా పని చేయాల్సిందే. నికోల్స్‌‌, గప్టిల్‌‌ ఓపెనింగ్‌‌లో కుదురుకుంటే బుమ్రా, షమీకి కష్టాలు తప్పవు. ఇక వెటరన్‌‌ రాస్‌‌ టేలర్‌‌ టీమ్‌‌కు అతిపెద్ద అండ. టీ20ల నుంచి అతని ఫామ్‌‌కు తిరుగులేదు. పేస్‌‌, స్పిన్‌‌ తేడా లేకుండా టేలర్‌‌ ఆడుతున్న తీరు సూపర్బ్‌‌. బ్లండెల్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌ గాడిలో పడాలి. ఫ్లూ కారణంగా పేసర్‌‌ కుగెలిన్‌‌ ఈ మ్యాచ్‌‌కు అందుబాటులో లేడు. దీంతో ఆరడుగుల జెమీసన్‌‌
ఈ మ్యాచ్‌‌లో అరంగేట్రం చేయనున్నాడు. కివీస్‌‌–ఎ టీమ్ కోసం స్పిన్నర్‌‌ సోధీని పంపించారు.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), మయాంక్‌‌, పృథ్వీ, శ్రేయస్‌‌, రాహుల్‌‌, మనీష్‌‌, జడేజా, సైనీ / ఠాకూర్‌‌, చహల్‌‌ / కుల్దీప్‌‌, షమీ, బుమ్రా.

న్యూజిలాండ్‌‌: లాథమ్‌‌ (కెప్టెన్‌‌), గప్టిల్‌‌, నికోల్స్‌‌, బ్లండెల్‌‌, టేలర్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌, నీషమ్‌‌, శాంట్నర్‌‌, జెమీసన్‌‌, బెనెట్‌‌, సౌథీ.

పిచ్‌‌, వాతావరణం

ఐదో స్థానంలో రాహుల్‌‌ ఆడిన రెండు ఇన్నింగ్స్‌‌లో 116 బాల్స్‌‌లో 168 రన్స్‌‌ చేశాడు. స్ట్రయిక్‌‌ రేట్‌‌ 144.82. అంటే ఫిఫ్త్‌‌ ప్లేస్‌‌కు కేఎల్‌‌ సూపర్‌‌ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాడు.  ఇక్కడ జరిగిన లాస్ట్‌‌ రెండు టీ20ల్లో కివీస్‌‌ ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేస్తే.. ఛేజింగ్‌‌ చేసిన ఇండియా రెండుసార్లూ గెలిచింది. ఈసారి సెకండ్‌‌ బ్యాటింగ్‌‌ అడ్వాంటేజ్‌‌.