లాస్ట్‌‌ ఫేజ్‌‌ పంచాయతీ..3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు

 లాస్ట్‌‌ ఫేజ్‌‌ పంచాయతీ..3,752 సర్పంచ్, 28,410 వార్డు  స్థానాలకు ఎన్నికలు
  •     3,752 సర్పంచ్​, 28,410 వార్డు స్థానాలకు ఎన్నిక
  •     ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 
  •     లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్.. ఆ వెంటనే విజేతల ప్రకటన
  •     ఇప్పటికే 394 సర్పంచ్​, 7,908 వార్డులు ఏకగ్రీవం
  •     ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్.. రేపటి వరకు 163 సెక్షన్ అమలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి.  మూడో విడత పోలింగ్‌‌‌‌‌‌‌‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతోనే ముగియగా..  మంగళవారం ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది. ఓటర్లను పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌లకు రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. మూడో విడతలోనూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్​ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించింది.  

ఎన్నికల ఆఫీసర్లు, సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్​ సెంటర్ల నుంచి  పోలింగ్​సామగ్రి తీసుకొని.. తమకు కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు. బుధవారం  ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమై..  మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది. లంచ్​బ్రేక్​ తర్వాత కౌంటింగ్​ ప్రక్రియ మొదలవుతుంది. గెలిచిన అభ్యర్థుల వివరాలను  వెంటనే ప్రకటించనున్నారు. మొదటి, రెండో విడత ఫలితాలను దిగ్విజయంగా వెల్లడించిన ఎస్ఈసీ ఈ విడతలోనూ అదే ఒరవడిని కొనసాగించేలా ప్లాన్​ చేసింది.  సర్పంచ్, వార్డు ఫలితాలు వెలువడిన వెంటనే  ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఈ విడత 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, రెండు పంచాయతీలు, 18 వార్డుల ఎన్నికలు జరగడం లేదు.  

3,547 కేంద్రాల్లో వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్​.. 

మూడో విడత పోలింగ్‌‌‌‌‌‌‌‌ కోసం 36,483 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్​ నిర్వహించనున్నారు.  4,502 మంది ఆర్వోలు, 77,618 మంది   పోలింగ్​ సిబ్బంది,  2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 43,856 బ్యాలెట్​ బాక్స్‌‌‌‌‌‌‌‌లను   అందుబాటులో ఉంచారు. పోలింగ్‌‌‌‌‌‌‌‌కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటా తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రూ.9 కోట్లు సీజ్‌‌‌‌‌‌‌‌

ఎన్నికల కోడ్ అమలులో అధికారులు కఠినంగా వ్యవహరించారు. మూడో విడతలో దాదాపు రూ.9.11 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. రూ. 2.09 కోట్ల నగదు,  రూ. 3.81 కోట్ల మద్యం, రూ. 2.28 కోట్లు డ్రగ్స్/నార్కోటిక్స్ , రూ. 12.20 లక్షల విలువైన బంగారం/ ఆభరణాలు, ఇతరాలు 78.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  

 టీఈ-పోల్ నుంచి ఓటరు స్లిప్‌‌‌‌‌‌‌‌లు డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్  

ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల సంఘం టీఈ–పోల్ మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఓటర్లు తమ స్లిప్పులను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రం ఎక్కడుందో మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే 9240021456 టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయవచ్చు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఓటరు స్లిప్పుల పంపిణీని మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 20న కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ మేరకు ఎంపీడీవోలు 
ఏర్పాట్లు చేస్తున్నారు.  

ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్​.. 

మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (పాత 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ కార్యదర్శి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయని, 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు.. లేదా ఓట్ల లెక్కింపు పూర్తయి, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్ల వద్ద ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం ఉంది. లైసెన్స్ ఉన్నా సరే.. ఎలాంటి ఆయుధాలు వెంట తీసుకురాకూడదు.  ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేదు. అధికారుల అనుమతి లేకుండా మైకులు, లౌడ్ స్పీకర్లు వాడకూడదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ సెక్రటరీ మకరందు హెచ్చరించారు. 

మహిళా ఓటర్లే కీలకం

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. వీరే  అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మూడో విడతలో మొత్తం 53,06,395 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 26,01,861 మంది ఉండగా, మహిళలు 27,04,394 మంది, ఇతరులు 140  మంది ఉన్నారు. అంటే దాదాపు లక్ష మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.  ఆధార్, పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌‌‌‌‌‌‌‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, పట్టాదార్ పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఎస్ఈసీ సూచించిన18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు ఓటు వేయవచ్చు. 

మూడో విడత ఇలా ..

మండలాలు                   182
ఎన్నికల నోటిఫికేషన్​ 
ఇచ్చిన పంచాయతీలు    4,159 
ఏకగ్రీవ పంచాయతీలు    394
ఏకగ్రీవమైన వార్డులు    7,908 
సర్పంచ్‌‌‌‌‌‌‌‌ బరిలో    12,652 
వార్డు బరిలో         75,725
మొత్తం ఓటర్లు    53,06,395
పోలింగ్ స్టేషన్లు    36,483
ఎన్నికల సిబ్బంది    77,618
వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్ కేంద్రాలు    3,547