నేడు సూర్యగ్రహణం

నేడు సూర్యగ్రహణం

బుధవారం రాత్రి నుంచే ఆలయాల మూసివేత
మధ్యాహ్నం సంప్రోక్షణ తర్వాత భక్తులకు అనుమతి

గురువారం ఉదయం 8.08- గంటల నుంచి 11.16 గంటల మధ్య పాక్షిక సూర్యగ్రహణం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రమే ఆలయాలను మూసేశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తలుపులు తెరిచి.. సంప్రోక్షణ, పుణ్యాహవచనం చేశాక భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

(వెలుగు నెట్వర్క్సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ మూసివేశారు. గురువారం ఉదయం 8.08- గంటల నుంచి 11.16 గంటల మధ్య పాక్షిక సూర్యగ్రహణం ఉన్నందున బుధవారం సాయంత్రం నుంచే ఆలయాలను మూసేశారు. యాదాద్రిలోని లక్ష్మీ సరసింహ స్వామి ఆలయానికి బుధవారం రాత్రి10 గంటలకు ద్వార బంధనం చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తలుపులు తెరిచి.. సంప్రోక్షణ, పుణ్యాహవచనం చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి7.-30 గంటలకు మూసివేశారు. గురువారం ఉదయం 11.-30 గంటలకు సంప్రోక్షణ చేసిన తర్వాత ఆలయ ద్వారాలు తెరుస్తారు.

12 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి దేవికి ప్రత్యేక పూజల తర్వాత బుధవారం సాయంత్రం 6.15 గంటలకు ప్రధాన ఆలయంతోపాటు ఉప ఆలయాల ద్వారాలను మూసివేశారు. గురువారం ఉదయం11.30 నిమిషాలకు సంప్రోక్షణ చేసి భక్తులను అనుమతిస్తారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 8 గంటలకు మూసివేసిన అర్చకులు.. గురువారం మధ్యాహ్నం12 గంటలకు సంప్రోక్షణ, ప్రత్యేక పూజల తర్వాత 3.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

ధర్మపురి ఆలయాన్ని బుధవారం 7 గంటలకు మూసేయగా, గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ద్వార బంధనం చేశారు. గురువారం 2 గంటలకు సంప్రోక్షణ తర్వాత దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని 7.30 గంటలకు మూసివేసిన అర్చకులు,
గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు తెరవనున్నారు.

సూర్యగ్రహణం కారణంగా విజయవాడలోని దుర్గగుడిని బుధవారం రాత్రి 9.30 గంటలకు మూసివేశారు. ఆలయ శుద్ధి, స్నపనాది కార్యక్రమాల తర్వాత గురువారం సాయంత్రం 5 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయం తలుపులు బుధవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. గురువారం ఉదయం 11.30 గంటల తర్వాత ఆలయశుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాతసేవ, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.