ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ

ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ

హైదరాబాద్​, వెలుగు: శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్ లో కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో సన్న వడ్ల కొనుగోలుపై నెలకొన్న వివాదంపై  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ఇప్పటికే  కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎంత బోనస్ ఇవ్వాలి, ఏ పద్ధతిలో అందివ్వాలనే దానిపై  నిర్ణయం తీసుకోనున్నారు. సాదాబైనామాలపై మంత్రివర్గం విధాన పరమైన నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.

సాదాబైనామాల పరిష్కారానికి ఆర్డినెన్స్​ ?

సాదాబైనామాల రెగ్యులరైజేషన్​ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్​ తెచ్చే అవకాశం ఉంది. కొత్త యాక్ట్​ అమల్లోకి రాగానే 1971 నాటి పాత చట్టం రద్దయిపోనట్లేనని తెలంగాణ రైట్స్​ ఇన్​ ల్యాండ్​ అండ్​ పట్టాదార్​ పాసు బుక్స్​ యాక్ట్​ –2020లోని సెక్షన్ 15 చెప్పతున్నది. కానీ కొత్త చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందాక 1971 నాటి చట్టం ప్రకారం సాదాబైనామాల రెగ్యులరైజేషన్​ కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. మరోసారి సాదాబైనామాల రెగ్యులరైజేషన్​ కు అవకాశం ఇవ్వడంతో ప్రజల నుంచి 9,00,894 అప్లికేషన్లు వచ్చాయి. కొత్త చట్ట ప్రకారం వీటిని పరిష్కరించడం కుదిరేలా లేదు. దీనిని అనుసరించే రాష్ట్రంలో సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల రెగ్యులరైజేషన్​ కు హైకోర్టు అభ్యంతరం చెప్పినందున ‘తెలంగాణ రైట్స్​ ఇన్​ ల్యాండ్​ అండ్​ పట్టాదార్​ పాసు బుక్స్​ యాక్ట్​ –2020’లో సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకోసం కేబినేట్ ఆమోదంతో ప్రత్యేక ఆర్డినెన్స్​ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై నిర్ణయం

గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ క్యాండిడేట్ల పేర్లను కేబినెట్ భేటీలో ఖరారు చేసే చాన్స్ ఉంది. ప్రస్తుతం గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు  ఖాళీగా ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలు వస్తున్నందున ఎమ్మెల్సీలను వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది.  గవర్నర్ నామినేటెడ్ చేసిన ఎమ్మెల్సీలను గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నమోదు చేయించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, శ్రవణ్ రెడ్డి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణి, గోరటి వెంకన్న, దేవీప్రసాద్ తో పాటు మరికొంత మంది రేసులో ఉన్నారు.