కరోనా వైరస్ మనకు చాలా నేర్పించింది. వైరస్ ఎఫెక్ట్ కాస్త తగ్గిన ఆ మహమ్మారి వదిలి వెళ్లిన భయం మాత్రం ఇంకా ప్రజల్ని నీడలాగే వెంటాడుతోంది. అందుకే కరోనా కేసులు తగ్గినా కూడా ప్రజలు మాత్రం తప్పని సరిగా కరోనా నిబంధనల్ని పాటిస్తూనే ఉన్నారు. మాస్కులు ధరించడంతో పాటు, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా పబ్లిక్ ప్లేసులు, షాపింగ్ మాల్స్, రైల్వే, బస్ స్టేషన్లలో ఎక్కడికక్కడ టెంపరేచర్ చెకింగ్ తప్పనిసరి చేశారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు టెంపరేచర్ చెక్ చేస్తూనే ఉన్నారు.
అయితే కొన్ని సందర్భాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడ చెక్ చేసేవాళ్లు అలసిపోవడంతో కొందర్నీ పట్టించుకోకుండా అలాగే వెళ్లనిస్తారు. కానీ తాజాగా ఓ చిన్నారి మాత్రం పబ్లిక్ ప్లేస్‌లో సెక్యూరిటీ గార్డ్స్ వద్దకు స్వయంగా వెళ్లి టెంపరేచర్ చెక్ చేసుకుంది. గార్డ్స్ ఏవో మాటల్లో మునిగి చిన్నారిని పట్టించుకోకపోయిన.. ఆమె మాత్రం వారిని వదల్లేదు. గార్డ్ చేతిలో ఉన్న థర్మా మీటర్ చూపిస్తూ.. తనకు టెంపరేచర్ చెక్ చేయాలని కోరింది. తన రెండు చేతుల్ని కూడా చెక్ చేయాలని గార్డ్‌ను కోరింది. అంతేకాదు తన చేతిలో ఉన్న టెడ్డీ బొమ్మకు కూడా టెంపరేచర్ చెక్ చేయించింది.
దినేష్ జోషి అనే ఓ నెటిజన్ ఈ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘రెస్పాన్స్‌బుల్ సిటిజన్ అంటే ఇలానే ఉండాలి’ అంటూ పోస్టుకు కామెంట్ కూడా చేశాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ప్రపంచానికి ఈ చిన్నారి చక్కని పాఠం చెప్పిందని కొందరు కొనియాడుతున్నారు. మరికొందరు.. ఈ క్రెడిట్ మొత్తం పాప తల్లిదండ్రులకు దక్కుతుందని పోస్టు చేస్తున్నారు. ఈ చిన్నారిని చూసి ప్రజలంతా తమ సామాజిక బాధ్యత తెలుసుకోవాలని ఇంకొందరు నెటిజన్స్ అంటున్నారు.
మరిన్ని వార్తల కోసం
