నేషనల్‌ స్పోర్ట్స్ డే రోజు డబుల్‌ ధమాకా

నేషనల్‌ స్పోర్ట్స్ డే రోజు డబుల్‌ ధమాకా

హాకీ స్టార్ ప్లేయర్, మేజర్ ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా భారత్‌ నేషనల్‌ స్పోర్ట్స్ డే జరుపుకొంటున్న ఈ రోజున టోక్యో పారాలింపిక్స్‌లో మన అథ్లెట్స్‌ డబుల్ ధమాకా కొట్టారు. ఐదు రోజులుగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో ఆదివారం ఒక్క రోజే రెండు మెడల్స్ సాధించారు. హైజంప్ లో నిషాద్‌ కుమార్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల హైజంప్ విభాగంలో అమెరికన్ అథ్లెట్‌ టౌన్‌సెండ్ రోడెరిక్‌ 2.15 మీటర్ల ఎత్తు జంప్ చేసి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, మన నిషాద్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ పారాలింపిక్స్‌లో భారత్ గెలిచిన రెండో మెడల్ ఇది.

టోక్యో పారాలింపిక్స్ లో ఈ రోజు ఉదయమే భారత్ తొలి బోణీ కొట్టింది. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా బెన్ పటేల్ సిల్వర్ మెడల్ గెలిచారు. మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్ 4 విభాగం ఫైనల్లో చైనా ప్లేయర్ యింగ్ జోవుతో తలపడింది భవీనా పటేల్. అయితే 0-3 తో భవీనా ఓడిపోయింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్ హిస్టరీలో టేబుల్ టెన్నిస్ లో భారత్ కు ఇదే ఫస్ట్ మెడల్. భవీనా, నిషాద్‌ సిల్వర్ మెడల్స్ గెలవడంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పారాలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపి మెడల్స్ సాధించడంపై ప్రశంసలు కురిపించారు.