నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా యంగ్ సెన్సేషన్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. ఇండోనేసియా లెజెండ్, వరల్డ్ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని ఓడిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. మెగా టోర్నీలో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 25వ ర్యాంకర్ ఆయుష్ 23–-21, 21–-17 తేడాతో వరుస గేమ్స్‌లో క్రిస్టీని ఓడించి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు.
6.4 అడుగుల ఎత్తున్న ఆయుష్ శెట్టి 54 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డాడు. . షార్ప్ యాంగిల్స్ నుంచి షాట్లు కొట్టడంతో పాటు పదునైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. తొలి గేమ్‌లో ఆయుష్ 2–0, 5–3తో నిలిచిన తర్వాత క్రిస్టీ పుంజుకున్నాడు. షాట్లలో వేగాన్ని మారుస్తూ ఇండియా ప్లేయర్‌పై ఒత్తిడి పెంచిన 11–8, 16–12తో ముందుకెళ్లాడు. అయినా ఆయుష్ ఏమాత్రం పట్టు వదలకుండా వరుస పాయింట్లతో 18–18తో స్కోరును సమం చేశాడు.
చివర్లో క్రిస్టీకి రెండు గేమ్ పాయింట్లు లభించినా, ఆయుష్ తన పదునైన స్మాష్‌లతో వాటిని అడ్డుకుని తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆపై, రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడుతూ పవర్‌ఫుల్ స్మాష్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. క్రిస్టీ పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇండియా ప్లేయర్ వరుస పాయింట్లతో తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.శనివారం జరిగే సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన టాప్ సీడ్ కున్లావుట్ విటిడ్‌సర్న్ తో తలపడనున్నాడు.
