
హైదరాబాద్: తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో చనిపోయారు. హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. దాదాపు నెల రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందించారు. కిడ్నీలు పూర్తిగా పాడయిపోవడంతో వైద్యులు డయాలసిస్ చేశారు. ఫిష్ వెంకట్ స్పృహలో ఉన్న సమయంలో ఎవరినీ గుర్తుపట్టలేకపోయాడు. బీపీ, షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కొన్నేళ్ల క్రితమే ఆయన కాలికి ఆపరేషన్ చేశారు. మృత్యువుతో పోరాడుతూ ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఫిష్ వెంకట్కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ‘ఆది’ సినిమాలో ‘తొడ కొట్టు చిన్నా’ అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్ పంచింది. నాయక్, బన్నీ, అదుర్స్, ఆంజనేయులు.. ఇలా చాలా తెలుగు సినిమాల్లో ఫిష్ వెంకట్ తనదైన హాస్యంతో, విలనిజంతో ప్రేక్షకులకు నవ్వులు పంచాడు. వన్లైనర్స్తో, తెలంగాణ యాసతో ఫిష్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమయ్యాడు. ఆయన అనారోగ్య పరిస్థితి గురించి పలు యూట్యూబ్ ఛానల్స్కు ఆయన ఇంటర్వ్యూలిచ్చారు. తనకు సాయం చేయాలని కోరారు. సినీ పరిశ్రమ నుంచి కొందరు స్పందించి సాయం చేశారు. ఆయన కిడ్నీలు రెండూ పాడైపోవడంతో కొన్ని నెలల నుంచి డయాలసిస్ చేసి ఆయనకు వైద్యులు చికిత్స అందించారు.
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ఆయన కోలుకోవడానికి ఉన్న ఒకేఒక్క ఆప్షన్ అని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. అయితే.. కిడ్నీల మార్పిడి ఖర్చుతో కూడుకున్న పని కావడం, ఆయన కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో సాయం కోసం ఆయన కుటుంబం ఆశగా ఎదురుచూసింది. కొందరు స్పందించి.. ఎంతోకొంత సాయం చేసినప్పటికీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు ఆ డబ్బు సరిపోలేదు. దురదృష్టవశాత్తూ.. ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోయాడు. ఫిష్ వెంకట్ మరణంతో టాలీవుడ్లోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.