
హైదరాబాద్: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకి హైదరాబాదు నగరం వణికిపోతుంది. నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండే నందమూరి బాలకృష్ణ వరద బాధితులకు కోటిన్నర రూపాయలను విరాళంగా ప్రకటించాడు.ఇక బాలయ్య ఇచ్చిన స్ఫూర్తితో మిగిలిన హీరోలందరూ ముందుకు వచ్చారు.
చిరంజీవి, మహేశ్ బాబు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. శతాబ్ద కాలంగా ఎప్పుడూలేనంత భారీ వర్షాలు హైదరాబాద్ ను అతలాకుతలం చేశాయని, భారీగా ప్రాణనష్టం జరిగిందని చిరంజీవి ట్విట్టర్ లో తెలిపారు. వరద ప్రభావిత కుటుంబాలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చేపడుతున్న చర్యలు అభినందనీయం అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం ఇస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వీలైనంతగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా నగర వాసుల కష్టాలు చూసి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ వంతు సాయంగా రూ. 50 లక్షలు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ & హారిక హాసిని ప్రొడక్షన్ రూ.20 లక్షలు, యంగ్ హీరో విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షలు విరాళం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారు ట్వీట్ చేశారు!