అప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు కనపడలేదా.. పెద్ది రిలీజ్కే ఎందుకిలా..?

అప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు కనపడలేదా.. పెద్ది రిలీజ్కే ఎందుకిలా..?

పర్సంటేజ్‌‌‌‌ విధానంపై ఇటీవల ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి, డెడ్ లైన్లు విధించారంటూ తెలుగు సినీ నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు  పాల్గొని తమ వాదనను వినిపించారు. నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ ‘ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం.

తమ ఒక్కరి ప్రయోజనం చూసుకు వెళ్లిపోతామని ఎగ్జిబిటర్స్‌‌‌‌ అనడం సరైనది కాదు. మూడు సెక్టార్లు కూర్చొని మాట్లాడుకోవాలి. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ టైమ్‌‌‌‌లో ఈ సమస్య తెరపైకొచ్చింది.  అప్పటినుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇన్ని సినిమాలు రిలీజ్‌‌‌‌ చేసినప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు మీకు గుర్తుకు రాలేదా.  సరిగ్గా మా సినిమా (పెద్ది) వచ్చేటప్పుడే ఈ సమస్యను తెరపైకి తీసుకురావడం కంటే.. మీ పెద్ద మనసుతో మీ పెద్ద సినిమా ఉన్న రోజున ఇదిగో పర్సెంటేజ్ అని హ్యాపీగా ఇవ్వొచ్చు కదా.. మీకు ఓ విగ్రహంకూడా కడతాం. 

నాలుగైదు నెలలుగా సరైన సినిమా లేక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో  ‘పెద్ది’ లాంటి మంచి సినిమా వస్తుంటే ఇలాంటి పరిస్థితులు సృష్టించడం సరైనది కాదు. ఎగ్జిబిటర్ల సమస్యతో పాటు అన్ని సమస్యలు చర్చించి, ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుందాం. అలాగే వసతులను బట్టి థియేటర్లను గ్రేడింగ్ చేసుకోవాలి’ అని చెప్పారు. మరో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఎగ్జిబిటర్ల పరిస్థితి బాగోలేదన్నారు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది. థియేటర్ల గ్రేడింగ్, మెయింటనెన్స్ ఛార్జ్, ఆన్​లైన్ టికెట్ బుకింగ్ కన్వినెన్స్ ఛార్జ్ వంటి విషయాలపై చర్చించాక, కొత్తగా నిర్మించే సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి వెళ్ళడంలో మాకు అభ్యంతరం లేదు. 

ఎన్నో చిన్న థియేటర్ల ఆదాయానికి గండి కొడుతున్న 300 మల్టిప్లెక్స్‌‌‌‌లు ఉన్న ఓ పెద్ద ఎగ్జిబిటర్‌‌‌‌‌‌‌‌.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. పర్సెంటేజ్ విధానం అమల్లో ఉన్న ఇతర రాష్ట్రాల కంటే మనమే మెరుగైన స్థితిలో ఉన్నాం’ అని చెప్పారు. ‘ఓ వైపు ఫిల్మ్ ఛాంబర్ తరపు నుంచి చర్చలు జరుగుతుండగా ఏకపక్షంగా ఎగ్జిబిటర్స్‌‌‌‌ ప్రెస్ మీట్ పెట్టారు. ఒక పెద్ద సినిమా వస్తున్న ప్రతిసారీ ఏదో ఒక ఆటంకం కలిగిస్తున్నారు. 

టికెట్ ధరలపై ప్రభుత్వం జీవో ఇచ్చినా ప్రదర్శించం అంటున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తాం అంటున్నారా’ అని నిర్మాత సాహు గారపాటి  అన్నారు.  ఎగ్జిబిటర్లకు న్యాయం జరగడం లేదనే విషయం.. ఇరవై ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ చేస్తున్న వాళ్లకు ఈరోజు గుర్తొచ్చిందా. సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకున్న వాళ్లు ఇప్పుడిలా మాట్లాడటం ఎంతవరకు సబబు అని నిర్మాత సుధాకర్ చెరుకూరి అన్నారు.