పెట్రోల్తో పోటీ పడుతున్న టమాటా..కారణం ఏంటంటే

పెట్రోల్తో పోటీ పడుతున్న టమాటా..కారణం ఏంటంటే

దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో టమాటా రూ. 20 , రూ. 30 పలకగా..ఇప్పుడు కిలో  టమాటా ధర ఏకంగా రూ.100 దాటి కన్నీళ్లు తెప్పిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో కిలో టమాటా రూ. 120 నుంచి 150 వరకు పలుకుతోంది. దీంతో టమాటా ప్రస్తుతం పెట్రోల్ ధరతో పోటీ పడుతోంది. లీటర్ పెట్రోల్ ధర దేశంలో రూ.110 ఉండగా..టమాటా ధర పెట్రోల్ ధరను క్రాస్ చేసింది. 

హైదరాబాద్లో ఎంత..

హైదరాబాద్‌లోనూ  టమాటా ధర పెట్రోల్ ధరతా సమానంగా ఉంది. ప్రస్తుతం పలు మార్కెట్లలో కిలో టమాటా రూ. 110  దాటేసింది.  అన్ని మార్కెట్లలో ఈ ధర 100 నుంచి 110 వరకూ పలుకుతోంది. 10 రోజుల క్రితం 25 కేజీల బాక్స్ 700 నుంచి 800 ఉంటే ..ఇప్పుడు ఏకంగా 2 వేల వరకు పలుకుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లనే  టమాటా రేటు 100 వరకు ఉంటే  సూపర్ బజార్లు, వీధి చివర సంతల్లో రూ. 110 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. 


టమాటా ధర పెరుగుదలకు కారణాలు

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమాటా పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వల్ల దిగుబడి తగ్గింది.  దీంతో టమాటాల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. నష్టాల కారణంగా రైతులు టమాటా సాగు తగ్గించారు. హర్యాణా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా బాగా తగ్గిపోయింది. దీని కారణంగా  హోల్‌సేల్‌ మార్కెట్లలో టమాటా ధరలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు టమాటాలు పండిస్తున్న  రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు కూడా పెరగడం వల్ల కూడా ధరలు పెరిగాయి. 

తుపాన్ ప్రభావం..

బైపర్జోయ్‌ తుపాన్‌ కూడా టమాటా ధర పెరగడానికి మరొక కారణం. ఈ తుపాను వల్ల గుజరాత్‌, మహారాష్ట్రల్లో పంట దిగుబడి తగ్గిపోయింది. ముఖ్యంగా గుజరాత్‌ లో పంట దిగుబడిపై తుపాను ప్రభావం ఫలితంగానే ధరలు పెరిగాయి.

ఎప్పటిదాకా ఈ ధర ఉండొచ్చు..

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కొత్త పంట దిగుబడి రావడానికి కనీసం ఒకటి, రెండు నెలలు పడుతుంది. టమాటా విత్తనాలు వేసిన మూడు నెలల తర్వాత వారానికి రెండు సార్లు టమాటాలు కోయొచ్చు. టమాటా తోటలు కనీసం ఒకటి రెండు నెలల పాటు దిగుబడి ఇస్తాయి. అది కూడా ఆయా విత్తనాల వెరైటీ, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి దిగుబడి ఉంటుంది.