రేపే ఆఖరు.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్న అగ్రనేతలు

రేపే ఆఖరు..  రాష్ట్రాన్ని చుట్టేస్తున్న అగ్రనేతలు
  •  ప్రచారంలో మోదీ, ఖర్గే, ప్రియాంక, షా
  •  సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ 
  •  పలుచోట్ల రోడ్ షోల్లో మాజీ సీఎం కేసీఆర్
  •  పేలుతున్న మాటల తూటాలు
  •  సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ముమ్మరంగా ప్రచారం
  •  రిజర్వేషన్ల చుట్టే సాగిన లోక్ సభ క్యాంపెయిన్

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరింది. రేపు సాయంత్రం ఐదు గంటలతో తెరపడనుంది. జాతీయ స్థాయి అగ్రనేతలకు తెలంగాణ కేరాఫ్ గా మారింది. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మల్లికార్జున ఖర్గే భువనగిరిలో నిర్వహించే సభలో మాట్లాడుతారు. ప్రధాని నరేంద్ర మోదీ గుల్బర్గా నుంచి నారాయణపేట చేరుకొని అక్కడ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. 

నిన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నర్సాపూర్, సరూర్ నగర్ సభల్లో పాల్గొన్న విషయం తెలిసందే. భువనగిరి సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సరూర్ నగర్ సభ అనంతరం రాహుల్ గాంధీ సిటీ బస్సు ఎక్కి ఉచిత ప్రయాణంపై మహిళలతో ముచ్చటించి కొత్త జోష్ నింపారు. దాదాపు సగం స్థానాలకు ఇప్పటికే పోలింగ్ పూర్తవడంతో కాంగ్రెస్, బీజేపీ ప్రధానంగా తెలంగాణపై దృష్టి సారించాయి. మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు. 

రుణమాఫీపై సవాల్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రల చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఇవాళ్టితో కేసీఆర్ బస్సు యాత్రలు ముగియనున్నాయి. కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు చేస్తూనే బీజేపీపైనా అస్త్రాలు సంధిస్తున్నారు మాజీ సీఎం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆగస్టు 15 నాటికి రూ. 2లక్షల రుణమాఫీ హామీని అమలు చేస్తానని సీఎం చెబుతుండటంతో సాధ్యం కాదంటూ బీఆర్ఎస్ సవాళ్లు విసురుతోంది. రుణమాఫీపై అంశం ఒట్లు, సవాళ్ల దాకా వెళ్లింది. హరీశ్ రావ్ రాజీనామా చేస్తానంటూ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లడం చర్చనీయాంశమైంది. 

సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గాడిద గడ్డు   

సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనజాతర సభలకు అటెండవుతూ బీజేపీని లక్ష్యం చేసుకొని విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఈ పదేండ్లలో ఇచ్చిందేమీ లేదని చెబుతున్నారు. గాడిద గుడ్డును ప్రతి సభలో ప్రదర్శిస్తూ.. బీజేపీ ఏమీ ఇవ్వలేదన్న మెస్సేజ్ ఇస్తున్నారు. 

రిజర్వేషన్ల చుట్టే క్యాంపెయిన్

లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ అంతా రిజర్వేషన్ల రద్దు చుట్టే తిరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం  మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తుందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఇది ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఎజెండాగా మారింది. అయోధ్య రామ మందిరం నినాదంతో క్యాంపెయిన్ కు బయల్దేరిన మోదీ, షా, నడ్డా, రాజ్ నాథ్.. రేవంత్ తెరపైకి తెచ్చిన రిజర్వేషన్ల రద్దు  ఎజెండాతో  తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. 

రాజ్యాంగాన్ని రద్దు చేయబోమని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు కావని సాక్షాత్తూ  ప్రధాని మోదీయే హామీ ఇస్తుండటం విశేషం. ఇదే తరుణంలో అమిత్​ షా వీడియో మార్ఫింగ్ కేసు కూడా కలకలం రేపింది. రాహుల్ గాంధీ ఏకంగా భారత రాజ్యంగం పుస్తకాన్నే సభల్లో ప్రదర్శిస్తూ.. అణగారిన వర్గాల గొంతు రాజ్యాంగం అని చెబుతూ దాని కాపాడుతామని భరోసా ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇస్తున్నారు. ఏది ఏమైనా  రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదంటూ రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన ఎజెండా ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది