రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్

రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్
  • ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న బీజేపీ చీఫ్
  • 6, 7 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత టూర్
  • 14న మహేశ్వరానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  • రాష్ట్రంలో పొలిటికల్ హీట్

హైదరాబాద్, వెలుగు: 
రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా 5న పాలమూరుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 14 న రాష్ట్రానికి రానున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 6న వరంగల్‌‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొననున్నారు. మరుసటి రోజు హైదరాబాద్‌‌లో పర్యటించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి రాహుల్ మాట్లాడే కార్యక్రమాన్ని పీసీసీ ఖరారు చేసింది. దీనికి రాష్ట్ర సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌‌ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఓయూలో మీటింగ్‌‌ను ఎలాగైనా నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇవికాక తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ లంచ్‌‌కు ఏర్పాట్లు చేశారు. తర్వాత గాంధీ భవన్‌‌లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. తమ నేతల పర్యటనలను విజయవంతం చేసేందుకు రెండు జాతీయ పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీనియర్ నేతలు పని చేస్తున్నారు.