లష్కరే టాప్ కమాండర్ ఎన్‌కౌంటర్

లష్కరే టాప్ కమాండర్ ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శ్రీనగర్‌లోని మల్హోరా పారింపోరా ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో లష్కర్-ఇ-తోయిబాకు చెందిన టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ సహా మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం భద్రతా బలగాలు పారింపోరాలో తనిఖీలు చేస్తుండగా.. ఒక వాహనాన్ని ఆపారు. అందులో ఉన్న వారి గుర్తింపు పత్రాలు అడుగుతుండగా.. ఒక వ్యక్తి గ్రెనైడ్ తీసి విసరబోయాడు. గమనించిన భద్రతా బలగాలు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని.. గ్రెనైడ్ విసరకుండా అడ్డుకున్నారు. వెంటనే ఆ వ్యక్తితో పాటు వాహనంలో ఉన్న మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తి మొహం మీద ఉన్న మాస్క్ తొలగించడంతో.. ఆ వ్యక్తి లష్కర్-ఇ-తోయిబాకు చెందిన టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ అని అధికారులు గుర్తించారు. 

అయితే విచారణలో భాగంగా.. అబ్రార్ ఓ ఇంట్లో AK-47 రైఫిల్‌ను దాచినట్లు గుర్తించారు. ఆ క్రమంలో రైఫిల్‌ను రికవరీ చేసేందుకు అబ్రార్‌ను మంగళవారం ఉదయం ఆ ఇంటికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ ఇంట్లో దాక్కున్న పాకిస్తాన్ ఉగ్రవాది.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులను అదునుగా తీసుకున్న అబ్రార్ కూడా బలగాలపై దాడికి దిగాడు. దాంతో భద్రతా బలగాలు అబ్రార్‌తో పాటు.. ఇంట్లో ఉన్న మరో ఉగ్రవాదిని కాల్చి చంపాయి. ఘటనా స్థలం నుంచి రెండు AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. పలువురు భద్రతా సిబ్బంది, పౌరులను చంపిన కేసుల్లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు నిందితులుగా ఉన్నారని ఆయన తెలిపారు.