
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. తొలకరి తర్వాత కొన్నాళ్లు మొహం చాటేసిన వానలు.. కాస్త ఆలస్యంగానైనా భారీగా కురుస్తున్నాయి. మొలిచిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్న సమయంలో ఎట్టకేలకు వానలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలు.. మరో నాలుగు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈరోజు( ఆదివారం జులై 20) భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇవాళ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు.ఇక హైదరాబాద్ లోతేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని సూచించారు.
రేపు (సోమవారం జులై 21) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్:
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు.
రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్:
నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపుల కారణంగా అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు. చేపల వేటకు వెళ్లేవాళ్లు.. రైతులు వర్షం వచ్చేముందే ఇళ్లకు చేరడం మంచిదని సూచించారు.