ఢిల్లీ: నల్లమలలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. సోమవారం ఇండియన్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ విడుదల చేశారు జవదేకర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సర్వే నివేదికలో అడవుల్లో, అడవి బయట వృక్షాలు బాగా పెరిగాయని..దేశ వ్యాప్తంగా అడవుల విస్తీర్ణం పెరిగిందన్నారు. అత్యధికంగా ఏపీలో 990 చదరపు కిలోమీటర్ల అడవుల విస్తీర్ణం పెరిగిందన్నారు. పర్వతాల్లో 0.19 శాతం పెరిగిందన్న ఆయన.. ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల శాతం తగ్గిందన్నారు. పారిస్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తున్నామని చెప్పారు.
ఒక చెట్టు కట్ చేస్తే పది చెట్లు పెంచేలా ప్రణాళికలు చేస్తున్నామన్న కేంద్ర మంత్రి..వెదురు బొంగు లను గడ్డి జాతి లో వేయడం వల్ల వెదురు ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. ఎర్ర చందనం భారత జాతి వృక్షం అయినా, మనం పెంచకపోవడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. స్మగ్లింగ్ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజస్థాన్ లో జల స్వావలబన వల్ల అడవుల విస్తీర్ణం పెరిగిందని తెలిపారు.
నల్లమలలో యురేనియం ఉందా ? లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు ప్రకాష్ జవదేకర్. వృక్షాలను పెంచడం భారత జాతి సంస్కృతి అని.. ప్రపంచంలో అడవులు పెరిగిన దేశాల్లో ఇండియా ముందజలో ఉందన్నారు. నాలుగేళ్లలో దేశంలో 13వేల చదరపు కిలోమీటర్ల అడవి పెరిగిందన్న ఆయన.. పారిస్ లక్ష్యాలకు అనుగుణంగా విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కంపా పథకం కింద అడవుల పెంపకానికి నలబై వేల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చామని చెప్పారు ప్రకాష్ జవదేకర్.


