
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. మంచుపేరుకుపోవడంతో నాలుగు జాతీయ రహదారులతో సహా 720 రోడ్లు బ్లాక్ అయ్యాయి. సిమ్లాలో 250 రోడ్లు, చంబాలో 163, లాహౌల్ అండ్ స్పితిలో 139, కులులో 67, మండిలో 54, కిన్నౌర్ జిల్లాలో 46 రోడ్లు మూసివేశారు. రోహ్రు, చోపాల్, నర్కంద, ఖద్రాలా వెళ్లే రోడ్లను మూసివేయడంతో ఎగువ సిమ్లా ప్రాంతాలకు వెహికల్స్ రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
మంచు ధాటికి హిమాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటిదాకా 2,243 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. హిమపాతంతోపాటు వర్షం కురుస్తుండటంతో టెంపరేచర్స్ గణనీయంగా పడిపోయాయి. పాదరసం గడ్డకట్టే స్థానం కంటే దిగువకు టెంపరేచర్ చేరింది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో 5-సెం.మీ లోతైన హిమపాతం రికార్డయ్యిందని, కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 0.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వాతావరణ బులెటిన్ వెల్లడించింది.
కాల్షియం క్లోరైడ్‌తో రోడ్లు క్లియర్
ఓ వైపు మంచు, మరో వైపు వర్షాలతో ప్రజలు చలితో విలవిల్లాడుతున్నారు. దాంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. కాల్షియం క్లోరైడ్‌తో రోడ్లను క్లియర్ చేస్తున్నారు. అయానిక్ ఉప్పు, కాల్షియం, క్లోరిన్‌తో కాల్షియం క్లోరైడ్ తయారవుతుంది. ఇది మంచును వేగంగా కరిగిస్తుంది. ఒక్కో లేన్‌లో కిలోమీటరుకు రూ. 500 ఖర్చు చేస్తున్నారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.72 కోట్లు విడుదల చేసినట్లు పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ శుక్రవారం పేర్కొన్నారు.