- కేంద్ర స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టూరిజం శాఖ ఏ ప్రాజెక్టు చేపట్టినా అటవీ శాఖ అడ్డుపడుతున్నది. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక పర్యాటక విధానాన్ని రూపొందించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్లాన్ చేసింది. పలు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినా.. అటవీ శాఖ అనుమతులు లభించకపోవడంతో ప్రాజెక్టులన్నీ నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ, పర్యాటక శాఖల మధ్య సమస్యలు, సమన్వయంపై చర్చించేందుకు మంగళవారం ఇరు శాఖల అధికారులు భేటీ అయ్యారు. అమరగిరి, అనంతగిరి, కిన్నెరసాని తదితర ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఫారెస్టు అధికారుల అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఎకో టూరిజం, సైకిల్ ట్రాక్, వెలెనెస్ సెంటర్ల ఏర్పాట్లలో చెట్ల తొలగింపు అంశాలపైనా దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ.. కేంద్ర పథకాల అమలుపై రెండు శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని సమస్యల పరిష్కారానికి దృష్టి సారిస్తామని తెలిపారు.
