టూరిజంతో మస్తు పైసలు

టూరిజంతో మస్తు పైసలు

107 శాతం పెరిగిన ఫారెక్స్​
ఇండియాకు భారీగా ఫారినర్ల రాక
వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ : టూరిజం సెక్టార్​ సర్కారు ఖజానా నింపుతోంది. ఫారినర్లు పెద్ద సంఖ్యలో ఇండియా వస్తుండటమే ఇందుకు కారణం.  పర్యాటకం ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం 2021లో రూ.65,070 కోట్ల నుండి 2022 నాటికి రూ.1,34,543 కోట్లకు అంటే 107శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే  కరోనా ముందు (2019 సంవత్సరం) తో పోలిస్తే మాత్రం ఆదాయాలు తక్కువగానే ఉన్నాయి. 2019 లో ఫారిన్​ టూరిస్టుల కారణంగా కేంద్రానికి రూ.2,11,661 కోట్లు ఫారిన్​ కరెన్సీ సమకూరింది. 2020లో కేవలం రూ.50,136 కోట్లు వచ్చాయి. కరోనా కారణంగా 2019 నుంచి చాలా కాలం పాటు పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. పలు హోటళ్లు, టూరిజం బిజినెస్​లు మూతబడ్డాయి.  

కరోనా ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టడం, దాదాపు అన్ని దేశాలూ ట్రావెల్​ బ్యాన్లను ఎత్తేయడంతో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మళ్లీ పట్టాలెక్కింది.  ఈశాన్య ప్రాంత సంస్కృతి, పర్యాటక అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్  తాజా డేటా ప్రకారం 2022లో భారతదేశానికి 61.9 కోట్ల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. 2021 అదే కాలంలో వీరి సంఖ్య15.2 కోట్లను మించలేదు. పర్యాటక పరిశ్రమ వేగంగా పుంజుకుంటోంది. దేశవ్యాప్తంగా టూరిజం ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను డెవెలప్​చేయడానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు/కేంద్రపాలిత ప్రాంతాలకు/కేంద్ర ఏజెన్సీలకు సాయం చేస్తున్నాం. ఇందుకోసం స్వదేశ్ దర్శన్, ప్రసాద్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దశలవారీగా టూరిజం ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం” అని రాజ్యసభలో వివరించారు. 

టూరిస్ట్​ ఫ్రెండ్లీ...

దేశీయ,  విదేశీ పర్యాటకులకు  జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, చైనీస్, జపనీస్, కొరియన్, అరబిక్, హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో సమాచారాన్ని అందించడానికి  కేంద్ర పర్యాటక శాఖ కాల్ సెంటర్లు నిర్వహిస్తోంది.    టోల్ ఫ్రీ నంబర్ 1800111363 లేదా 1363 షార్ట్​కోడ్​కు ఫోన్​ చేసి ఫారినర్లు  10 అంతర్జాతీయ భాషలు సహా 12 భాషల్లో సమాచారం పొందవచ్చు. కస్టమర్​ కేర్​ సర్వీసులు 24 గంటలూ పనిచేస్తాయి. మరింత మంది పర్యాటకులను ఆకర్షించడానికి ఈ–వీసా రూల్స్​ను ఇంకా ఈజీ చేశారు. 166 దేశాల జాతీయులు ఈ–-టూరిస్ట్ వీసా, ఈ--–-బిజినెస్ వీసా, ఈ--–-మెడికల్ వీసా, ఈ--–-మెడికల్ అటెండెంట్ వీసా, ఈ–-కాన్ఫరెన్స్ వీసా-లను పొందవచ్చు.

అడ్వెంచర్ టూరిజాన్ని మరింత ఎంకరేజ్​ చేయడానికి మౌంటనేరింగ్​/ట్రెక్కింగ్ కోసం కొత్త పర్వత శిఖరాలకు వెళ్లడానికి పర్మిషన్లు ఇచ్చారు. పర్యాటకులకు మరింత తక్కువ ధరలతో వసతిని అందుబాటులోకి తేవడానికి హోటల్​ రూమ్స్​పై జీఎస్టీని 12 శాతానికి (ఒకరాత్రికి టారిఫ్​ రూ.వెయ్యిలోపు ఉన్నవి​) తగ్గించారు.  ఒకరాత్రికి రూ. 7,500 కంటే ఎక్కువ ఖర్చయ్యే హోటళ్ల గదులపై జీఎస్టీని 18 శాతానికి కుదించారు. ఈసారి మనదేశం జీ20 సమావేశాలు నిర్వహించినందున ఫారిన్​ విజిటర్ల సంఖ్య మరింత పెరగనుందని పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది.