
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్.. ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయికి ధీటుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీని రంగంలోకి దించారు. హాలీవుడ్ టీంతో ఇప్పటి వరకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు.
ఇప్పుడు జె.జె. పెర్రీ ఇండియన్ స్టంట్ టీంని తీసుకుని ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. 45 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘమైన షెడ్యూల్‌లో కేవలం ఇండియన్ స్టంట్ టీం మాత్రమే పని చేయనుంది. ఈ సందర్భంగా పెర్రీ మాట్లాడుతూ ‘ఈ ఇండియన్ స్టంట్ టీం వర్డల్ క్లాస్‌గా ఉంది. అందుకే నేను వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం కీలక సన్నివేశాన్ని చిత్రీకరించబోతోన్నాం. ఇది నాకు సవాల్ లాంటిది. మేమంతా కలిసి సరిహద్దుల్ని చెరిపేసేలా అంతర్జాతీయ స్థాయిలో ‘టాక్సిక్’ను రూపొందిస్తాం’ అని చెప్పాడు.