KCR దీక్ష ఓ నాటకం.. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

KCR దీక్ష ఓ నాటకం.. సోనియా వల్లే తెలంగాణ వచ్చింది: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: బీఆర్ఎస్ చేపట్టనున్న దీక్షా దివాస్‎పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం (నవంబర్ 28) గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‎ను వాడుకున్నారని.. ఇప్పుడు ఉనికి కోసం దీక్షా దివాస్‌ పేరుతో బీఆర్ఎస్ మళ్లీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ దీక్ష ఎలా చేశాడు.. అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. 

కేసీఆర్‌ దీక్ష ఓ నాటకమని.. కేవలం 3 రోజులకే దీక్ష విరమించి పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. దీక్ష మధ్యలోనే విరమిస్తే విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయని అన్నారు. కేవలం కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాలేదని.. కాంగ్రెస్, సోనియా గాంధీ వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు.. కేసీఆర్ చేసినా దీక్షకు అసలు పొంతనే లేదన్నారు. ఉద్యమంలో ఎవరి బిడ్డలు చనిపోయారో అందరికీ తెలుసని.. మరీ కేసీఆర్ కుటుంబంలో, బంధువుల్లో ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించారు.

 ఆనాడు కిరోసిన్ పోసుకున్న కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టే ఎందుకు దొరకలేదో అని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పాణం చేసుకున్నారని.. వాళ్ల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. పేదల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణను పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సోనియా గాంధీ దయ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని.. తెలంగాణ రాకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదని అన్నారు.